ఇస్రో మరో భారీ ప్రయోగం..

By అంజి  Published on  29 Feb 2020 5:36 AM GMT
ఇస్రో మరో భారీ ప్రయోగం..

నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే చంద్రయాన్‌, మంగళయాన్‌ వంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలతో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఇస్రో.. మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమవుతోంది ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ప్రయోగాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఇస్రో.. అదే స్ఫూర్తి, అదే లక్ష్యంతో జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌పై దృష్టి పెట్టింది. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నింగిలోకి పంపేందుకు ఇస్రో సిద్ధమైంది.

మార్చి 5న శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌-ఎఫ్‌10వాహక నౌకను అంతరిక్షంలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. షార్‌లో దీనికి సంబంధించిన సన్నహాలు జరుగుతున్నాయి. అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లగలిగే జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ల రూపకల్పనలో ఇస్రో తన సొంత పరిజ్ఞానాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సిరీస్‌పై ఇస్రో ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ అనుసంధానం ప్రక్రియ పూర్తి కావస్తోంది. ఈ ప్రయోగం చేపట్టి.. జియో ఇమేజింగ్‌పై గట్టి పట్టు సాధించడానికి ఇస్రో కృషి చేస్తోంది.

2 వేల 300 కిలోల బరువున్న జీశాట్‌-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. రాకెట్‌లో ఇంధనం నింపే ప్రక్రియ కూడా పూర్తైంది. శ్రీహరికోటలోని రెండో నంబర్‌ లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీని ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ ఎప్పుడు ప్రారంభిస్తామని మాత్రం ఇస్రో ఇంకా చెప్పలేదు. వాతావరణ పరిస్థితులను కౌంట్‌డౌన్‌ మొదలు పెట్టే అవకాశాలున్నాయి. భూమిని అబ్జర్వ్‌ చేసేందుకు జీశాట్‌-1లో అత్యంత అధునికమైన పరికరాలను అమర్చారు.

జియో సంక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ పరికరాలు ఇందులో ఉన్నాయి. భూ ఉపరితలాన్ని మరింత సృష్టంగా ఫొటోలు తీసేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ తరహా ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ద్వారా మొదటిసారి అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ఇది భారత ఉపఖండాన్ని సునిశీతంగా పరిశీలిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇస్రో చైర్మన్ కె.శివన్‌, షార్‌ డైరెక్టర్‌ ఆర్ముగం రాజరాజన్ల పర్యవేక్షణలో ప్రయోగానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

Next Story