సర్రోగసీ… అంటే అద్దె గర్భం… వివిధ కారణాల వల్ల పిల్లల్ని కనలేని వారు అద్దె గర్భంతో  అమ్మలు అయ్యే ప్రక్రియ ఇది. ఇప్పుడు నగర జీవనపు నాగరికం వల్ల వస్తున్న పలు సమస్యల వల్ల అద్దె గర్భానికి డిమాండ్ నానాటికీ పెరుగుతోంది. జీవన వేగం, పని ఒత్తిడులు, వయసు మీరడం, ఆరోగ్య సమస్యలు, జీవన శైలి వల్ల వస్తున్న ఇబ్బందుల వల్ల పలువురు ఇప్పుడు సర్రొగసీ ద్వారా సంతానాన్ని పొందుతున్నారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ పద్ధతిని కోరుకుంటున్నారు.

సినీ స్టార్లు సన్నీ లియోన్, మంచు లక్ష్మి, కిమ్ కర్దషియాన్, ఆమిర్ ఖాన్ వంటి వారు ఇప్పటికే అద్దె గర్భంతో అమ్మలు, నాన్నలు అయ్యారు. తాజాగా ఈ జాబితాలో పొడుగుకాళ్ల సుందరి శిల్పా శెట్టీ కూడా చేరిపోయారు. అయిదేళ్ల పాటు రెండో సంతానం కోసం అష్టకష్టాలు పడ్డ తరువాత శిల్పా, ఆమె భర్త రాజ్ కుంద్రాలు సర్రొగసీని ఆశ్రయించి అమ్మా నాన్నలు అయ్యారు. నిజానికి శిల్పా శెట్టి వయసు వల్ల కూడా సర్రొగసీని ఆశ్రయించాల్సి వచ్చిందని కొందరు నిపుణులు అంటున్నారు. ఎందుకంటే 30 ఏళ్లు దాటిన తరువాత మహిళలు గర్భం దాల్చే అవకాశాలు చాలా తక్కువ. అయితే పని ఒత్తిడి వల్ల కూడా తొమ్మిది నెలలు బిడ్డను మోసే సమయం ఉండకపోవచ్చునని నిపుణులు అంటున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ సర్రొగసీ పట్టణాల్లోనే పాపులర్. ఇది ఇంకా గ్రామాలకు వ్యాపించలేదు. ఆర్ధికంగా నిలదొక్కుకోవడం కోసం ఏళ్ల తరబడి పరిశ్రమించడం తో బిడ్డల్ని కనాల్సిన సమయం దాటిపోతోంది. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. భారతదేశ మహిళలు 45 ఏళ్ల వరకూ పిల్లలను కంటారు. అదే యూరోపియన్ దేశాల్లో 58 ఏళ్ల వరకూ పిల్లల్ని కనే సామర్థ్యం ఉంటుంది. అదే విధంగా  నిత్యం సోషల్ మీడియా లో బిజీగా ఉండటం వల్ల ప్రేమలోని ఆ స్పార్క్ ను ఫీల్ కావడం కూడా కష్టమైపోతోంది. దాంతో సంతానహీనత సైతాన్ లా పెచ్చరిల్లుతోంది. ఇవే కాక ఆధునిక జీవన శైలి వల్ల ఫైబ్రాయిడ్లు, ఎండో మెట్రియాసిస్ వంటి ఆరోగ్య సమస్యల వల్ల మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యం దెబ్బతింటోంది.

అయితే సర్రొగసీ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. చాలా చట్టపరమైన ప్రక్రియలు కూడా పాటించాల్సి ఉంటుంది. అయినప్పటికీ హైదరాబాద్ లో సర్రొగసీ నానాటికీ పాపులర్ అవుతోంది. నగర జీవనంలో ఒత్తిడి వల్లే అద్దె గర్భం ప్రక్రియను చాలా మంది అవలంబిస్తున్నారని నిపుణులు అంటున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.