ప్రత్యేకమైన రోజు.. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన 'బుజ్జాయిలు'

By అంజి  Published on  1 March 2020 6:15 AM GMT
ప్రత్యేకమైన రోజు.. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన బుజ్జాయిలు

ముఖ్యాంశాలు

  • లీప్‌ సంవత్సరం రోజున కళ్లు తెరిచిన బుజ్జాయిలు
  • సంతోషం వ్యక్తం చేసిన శిశువుల తల్లిదండ్రులు
  • కాలాన్ని ఎవరూ ఆపలేరు కదా: ఓ శిశువు తల్లి

హైదరాబాద్‌: 2020 ఏడాది ‘లీపు సంవత్సరం’ సందర్భంగా ఫిబ్రవరి 29న చాలా మంది గర్భిణీలు ప్రసవాలు చేయించుకున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే దాదాపు 300 మంది పసిపాపలు.. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అయితే ఫిబ్రవరి 29 ప్రత్యేకమైన రోజు అని తెలిసిన విషయమే.

ఈ రోజు పుట్టిన వారు ప్రతి సంవత్సరం పుట్టిన రోజు వేడుకలు చేసుకోలేరు. ఎందుకంటే ఫిబ్రవరి 29.. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. ఈ విషయమై ప్రతి సంవత్సరం పుట్టిన రోజు జరుపుకొలేని వారికి కొంత బాధైనా.. ఫిబ్రవరి 29 వస్తే వారికి అది స్పెషల్‌ డేనే.

ఫిబ్రవరి 29 ఒక్క రోజునే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చాలా ప్రసవాలు జరిగాయి. అయితే లీప్‌ డేను గుర్తు పెట్టుకొని చాలా మంది గర్భిణీలు సిజేరియన్లు చేయించుకునేవారు చాలా తక్కువేనని వైద్యులు అంటున్నారు. ఒక్క నిలోఫర్‌ ఆస్పత్రిలోనే శనివారం రోజున 11 మంది శిశువులు జన్మించారు. సుల్తాన్‌బజార్‌, పేట్లబుర్జు, కోఠితో పాటు ఏరియా ఆస్పత్రులు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో 200కుపైగా బుజ్జాయిలు కళ్లు తెరిచారు.

రహ్మత్‌నగర్‌ డివిజన్‌ శ్రీరామ్‌నగర్‌లోని యూసీహెచ్‌సీలో ఫిబ్రవరి 29న ఇద్దరు శిశువులు జన్మించారు. ఎర్రగడ్డలో ముత్యాల నీరజ.. శనివారం తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గాంధీ ఆస్పత్రిలో శనివారం 11 మంది పిల్లలు పుట్టారు. ఆరుగురు ఆడపిల్లలు కాగా, ఐదుగురు మగ పిల్లలు పుట్టారు. ఫిబ్రవరి 29 ప్రత్యేకమైన రోజు కావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌, గైనకాలజిస్ట్‌ మహాలక్ష్మీ.. శిశువుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.

సూల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆస్పత్రిలో 22 మంది శిశువులు కన్నుతెరిచారు. ఫిబ్రవరి 29 రోజున బిడ్డలను కనడం తమకు ఎంతో ఆనందంగా ఉందని కొంతమంది మాతృమూర్తులు తెలిపారు. ప్రతి నాలుగేళ్లకొకసారి గ్రాండ్‌గా జన్మదిన వేడుకలు జరుపుతామని శిశువుల తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా పెద్ద సంఖ్యలోనే శిశువులు పుట్టారని తెలిసింది. తెనాలిలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో మొత్తం ఐదుగురు శిశువులు జన్మించారు.

Next Story