'గవర్నర్' పర్యటన వెనుక ఆంతర్యమేంటీ..?
By సుభాష్ Published on 12 Dec 2019 5:16 PM ISTతెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందరరాజన్ రాజ్‌భవన్‌కే పరిమితం కాకుండా రాష్ట్రంలో తనదైన ముద్ర వేసుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. గవర్నర్ అంటే ఇలా ఉండాలి అని తమిళ్ సై సీఎం కేసీఆర్ ప్రభుత్వంకు చూపేలా ఉన్నట్లు కనిపిస్తోంది. తమిళ్ సై సౌందరరాజన్ పక్కా బీజేపీ నేత. ఆమె గవర్నర్ కాక ముందు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగారు. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు నుంచి వచ్చిన ఆమె ఏపీలో బీజేపీ బలోపేతానికి కొంత ఊతమిస్తారని ముందుగా అందరూ ఊహించారు.
నాలుగు రోజుల పర్యటన:
తెలంగాణ గవర్నర్ గా తమిళ్ సై బాధ్యతలను చేపట్టిన తర్వాత ప్రజా దర్బార్ ను నిర్వహిస్తున్నట్లు టాక్ వినిపించింది. అడపా దడపా ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతున్న ఆమె తాజాగా నాలుగు రోజుల పర్యటన చేశారు. ఈ పర్యటనలో దేవాలయాలతో పాటు వివిధ ప్రాజెక్టుల సందర్శన, డ్వాక్రా మహిళల సమావేశంలో పాల్గొన్నారు. ప్రజలతో తమిళ్ సై మమేకం కావలన్నదే ఆమె ఉద్దేశమని తెలుస్తోంది. అలాగే పర్యటనలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెడ్ క్రాస్ సోసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరిక్ మెడికల్ షాపును గవర్నర్ ప్రారంభించారు. తర్వాత విద్యార్థుల గౌరవ వందనాన్ని ఆమె స్వీకరించారు. అనంతరం గవర్నర్ తమిళసై కాటరం మండలం బోడగూడెం గ్రామానికి వెళ్లి, గిరిజనులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సమస్యలను, వారి జీవన స్థితిగతులను గవర్నర్ అడిగి తెలసుకున్నారు. అక్కడే మొక్కలను నాటారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. గవర్నర్ హోదాలో రాలేదు.. మీ అక్కగా వచ్చాను.. నిర్వాసితులకు భూమి, డబుల్ బెడ్రూమ్ అందిస్తానంటూ ఈ సందర్భంగా వారితో తెలిపారు.
ఆర్టీసీ సమ్మె సమయంలో..
తెలంగాణ ఆర్టీసీ సమ్మె జోరుగా కొనసాగుతున్న సమయంలో గవర్నర్ ఆర్టీసీ ఉన్నతాధికారులను రాజ్ భవన్ కు పిలిపించుకుని మాట్లాడారు. ఆర్టీసీ యూనియన్ నేతలతో పాటు విపక్షాలకు పలు దఫాలు అపాయింట్ మెంట్లు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో తమిళ్ సై జోక్యం చేసుకున్నారనే చెప్పాలి. తర్వాత కేంద్ర సర్కార్ కూడా గవర్నర్‌ను ఢిల్లీకి పిలిపించుకుని తెలంగాణ ఆర్టీసీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంది. ఆ తర్వాత కేసీఆర్ గవర్నర్ వద్దకు వెళ్లి దాదాపు రెండు గంటల సేపు సమావేశమై రాష్ట్ర పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాల వంటి విషయాలను చర్చించి వచ్చారు.
గవర్నర్ గా నరసింహన్ ఉన్నప్పుడు పెద్దగా ప్రభుత్వంలో జోక్యం చేసుకున్నది లేదు. అయితే తమిళ్ సై మాత్రం తన పర్యటనలతో అధికార పార్టీలో అలజడి రేపుతున్నారనే రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గవర్నర్ నరసింహన్ స్థానంలో ఈమెను పంపించిన కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇరుకున పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నట్లు కనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పర్యటించిన ఆమె యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్నారు. తర్వాత వరంగల్ లో ఒక ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా గవర్నర్ తమిళ్ సై తెలంగాణాలో నాలుగు రోజుల పర్యటన ఆసక్తిరేపుతోంది. అధికార పార్టీలో కొంత అలజడి రేగిందనే చెప్పాలి. గవర్నర్ పర్యటనలో అధికార పార్టీతో పాటు బీజేపీ నేతలు ఎక్కడక్కడ పాల్గొంటున్నారు.