ముఖ్యాంశాలు

  • సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో పోరాటం చేయనున్న కేసీఆర్‌

  • త్వరలో ఎంపీలతో కలిసి ఢిల్లీకి 

  • తమ సమస్యలు పట్టించుకోవడం లేదని మోదీపై కేసీఆర్‌ అసహనం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవ్వరికి తెలియని పరిస్థితి. కాగా, నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్‌ పోరుకి సిద్ధం అవుతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాజకీయ వర్గాల్లో. తెలంగాణ సమస్యలను మోదీ సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని, ఇక  తాడోపేడో తేల్చుకునేందుకు కేసీఆర్‌ సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతమనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ మోదీ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై కేసీఆర్‌ కూడా అసహనం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం తీరును తీవ్రంగా తప్పుబట్టారు కేసీఆర్‌. మోదీ ప్రభుత్వ చర్యకు అప్పట్లో అప్పట్లో బంద్‌కి పిలుపునిచ్చారు.

ఆ తర్వాత బీజేపీకీ, టీఆర్‌ఎస్‌ కు మధ్య  క్రమంగా సఖ్యత పెరుగుతూ వచ్చింది. నోట్ల రద్దు , జీఎస్‌టీ లాంటి కీలకనిర్ణయాల విషయంలో, కేసీఆర్‌ మోదీ ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇక రాష్టపతి ఎన్నికల్లోనూ, అనేక బిల్లుల ఆమోదంలోను టీఆర్‌ఎస్‌ బీజేపీ వైపునే మొగ్గుచూపింది. ఆ తర్వాతే పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. తెలంగాణ బీజేపీ నాయకత్వం కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం ప్రకటించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు బీసజేపీ శతవిధాలుగా  ప్రయత్నం చేసింది. దాంతో రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ చరిష్మా తెలంగాణలో కొంత మేరకు నిలువరించింది.

కేంద్రంపై తెలంగాణ సర్కార్‌ అసహనం:

కాగా, కేంద్రంలో రెండోసారి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తెలంగాణపై పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిఎస్టీ పన్నుల్లో వాటా ఇవ్వడంలోను, వివిధ శాఖ కింద రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల విషయంలోను మోదీ ప్రభుత్వం తెలంగాణ విఙ్ఞప్తులను పెడచెవిన పెడుతుందని, త్వరలో ఢిల్లీవెళ్లి ఏదో ఒకటి తేల్చుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కేంద్రంపై యుద్దానికి కేసీఆర్‌ సిధ్వమతున్నారన్నవార్తలు వినవస్తున్నాయి. ఓ వివాహానికి హాజరయ్యేందుకు డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీ వెళ్ళిన కెసీఆర్.. ప్రధాన మంత్రిని కలిసేందుకు ప్రయత్నించారు. ఆ సమయం దొరకలేదన్న కథనాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో భారీగా జాబితాతో.. గత అయిదేళ్ళుగా కేంద్రం నిర్లక్ష్యానికి నిదర్శనాల వివరాలతో కలిసి.. టీఆర్ఎస్ ఎంపీల బృందంతోపాటు సీఎం కేసీఆర్‌ ప్రధానిని కలిసేందుకు త్వరలోనే ఢిల్లీ వెళ్ళేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత  సీఎం ఢిల్లీ వెళ్తారని, అందుకు రంగం సిద్దమవుతోందని గులాబీ శ్రేణులు చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.