ఏపీ ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ సస్పెన్షన్..!
By సుభాష్ Published on 13 Dec 2019 11:27 AM ISTచంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈవోగా విధులు నిర్వహించిన ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్‌పై జగన్ సర్కారు అనూహ్య రీతిలో సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై అధికార వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే... ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ కేంద్రం నుంచి ఏపీ రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చారు. చంద్రబాబు హయాంలో ఈడీబీ సీఈవోగా విధులు నిర్వహించారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఆయనను విధుల నుంచి తప్పించారు. తర్వాత కూడా ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తనను రిలీవ్ చేస్తే కేంద్ర సర్వీసులకు వెళ్తానని కృష్ణ కిశోర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. కానీ, ఆయనను ప్రభుత్వం రిలీవ్ చేయలేదు.
గురువారం అనూహ్యంగా ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వాణిజ్య శాఖల నుంచి అందుకున్న నివేదిక ఆధారంగానే తాము ఈ నిర్ణయం తీసున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కృష్ణ కిశోర్‌పై ఏసీబీ డైరెక్టర్ జనరల్, సీఐడీ విడివిడిగా కేసులు నమోదు చేసి, అక్రమాలపై విచారణ జరిపి ఆరు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం జాస్తి కృష్ణ కిశోర్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు, క్రమ శిక్షణ చర్యలు పూర్తయ్యే వరకు ఇది కొనసాగుతుందని వివరించారు. అంతేకాదు.. విచారణ పూర్తయ్యే వరకు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని కృష్ణకిశోర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.