ప్రయాణికులకు గుడ్‌న్యూస్ : తక్కువ చార్జీతో విమాన ప్రయాణం
By న్యూస్‌మీటర్ తెలుగు
ప్రయాణికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ సందర్భంగా తక్కువ చార్జీతో విమాన ప్రయాణం చేయవచ్చని ప్రకటించింది. దీంతో బెంగుళూరుకు రూ.2 వేలు, హైదరాబాద్‌కు రూ.2,400 చార్జీలతో ప్రయాణించవచ్చు. లాక్‌డౌన్ కారణంగా అంతర్జాతీయ విమాన సేవలు ఇంకా ప్రారంభం కాలేదు.. అంతర్ రాష్ట్ర విమాన సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
కరోనా మహమ్మారి భయం కారణంగా ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో, వారిని ప్రోత్సహించేలా విమాన చార్జీలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం చెన్నై నుంచి బెంగుళూరు వెళ్లేందుకు రూ.1,700 నుంచి రూ.2 వేల వరకు, చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు రూ.2,400 నుంచి రూ.2,800 వరకు, ఢిల్లీకి రూ.4 వేలు చార్జీగా నిర్ణయించారు.
ఇదిలావుంటే.. చెన్నై నుంచి ప్రతిరోజు 133 విమానాలు వివిధ నగరాలకు నడుపుతున్నారు. లాక్‌డౌన్ సడలింపులతో ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. సాధారణంగా పండుగ సీజన్‌లో విమాన చార్జీలు పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం దీపావళి పండుగ దగ్గరపడుతున్న తరుణంలో విమాన చార్జీలు తగ్గడంతో ప్రయాణికులు ఏమేర ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారో చూడాలి మరి.