పట్టుబడిన స్మగ్లర్లు జైల్లో ఉండగా.. అధికారుల్లో టెన్షన్ ఉండదా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 March 2020 1:49 AM GMT
పట్టుబడిన స్మగ్లర్లు జైల్లో ఉండగా.. అధికారుల్లో టెన్షన్ ఉండదా..?

ప్రపంచమంతా కరోనా వైరస్ తో పోరాడుతోంది. ఎక్కడెక్కడ అనుమానితులు ఉన్నా.. అధికారులు వెంటనే వారిని జల్లెడ వేస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేసినా పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని ఎంతగానో అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఇటీవల పట్టుబడిన గోల్డ్ స్మగ్లర్ల విషయంలో చంచల్ గూడ అధికారులు అప్రమత్తమయ్యారు. మార్చి 1 నుండి ముగ్గురికి పైగా బంగారం స్మగ్లర్లను రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు. వారిలో కొందరు దుబాయ్, అబుదాబి, రియాద్ దేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలియడంతో అధికారుల్లో కాస్త టెన్షన్ మొదలైంది.

ఏ ఖైదీకి కరోనా పాజిటివ్ లేదు:

చంచల్ గూడ జైలు సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తమ జైలులో మాత్రమే విదేశాల నుండి వచ్చిన ఖైదీలు ఉన్నారని అన్నారు. 1215 మంది ఖైదీలలో 40 మంది ఆఫ్రికాకు చెందిన వారు ఉన్నారని.. ఓ ఖైదీ నైజీరియాకు చెందిన వాడని.. అతన్ని అరెస్టు చేసి నెల రోజులు పైనే అయిందని అన్నారు. చంచల్ గూడ జైలులో ముగ్గురు భారత్ కు చెందిన ఖైదీలు కూడా ఉన్నారు. బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురు భారతీయుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు.

మార్చి 8, ప్రేమ్ చంద్ గుప్త, 39 లక్షల రూపాయల బంగారాన్ని మిక్సర్ గ్రైండర్ లో దాచాడు. దుబాయ్ నుండి వచ్చిన ప్రేమ్ చంద్ గుప్తను చంచల్ గూడ జైలుకు తరలించారు. మార్చి 12న రియాద్ నుండి వచ్చిన ఓ ప్యాసెంజర్ నుండి 60 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్చి 17న 5.3 లక్షల విలువైన బంగారు చైన్స్ ను తీసుకొచ్చిన మరో ప్యాసెంజర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు ఎయిర్ అరేబియా విమానం నుండి హైదరాబాద్ కు చేరుకున్నాడు.ఈ ముగ్గురులో ఒక వ్యక్తి బెయిల్ మీద విడుదలైనట్లు అధికారులు తెలిపారు.

మిగిలిన ఇద్దరికీ టెస్టులు నిర్వహించగా నెగటివ్ వచ్చింది. ముందు జాగ్రత్తగా వారిని ఐసొలేషన్ లో ఉంచారు. జైలులో అందరికీ మాస్కులు, శానిటైజర్లు అందించారు. బ్యారక్స్ ను శుభ్రంగా కూడా ఉంచుతున్నామని శ్రీనివాస్ తెలిపారు. ఎవరైతే కొత్తగా జైలులోకి వస్తారో వారికి పూర్తిగా స్నానం చేయించి.. వారందరినీ శానిటైజ్ చేసిన తర్వాతనే జైలు లోనికి పంపిస్తున్నామని అన్నారు. అలాగే డాక్టర్స్ తో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరైనా ఖైదీ విదేశాలకు వెళ్లి వచ్చినట్లు తెలిస్తే వారిని వెంటనే క్వారంటైన్ లో ఉంచుతామని శ్రీనివాస్ తెలిపారు.

చర్లపల్లి జైలు సూపరింటెండ్ ఎం.సంపత్ మాట్లాడుతూ తాము కూడా ఈ పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ఇప్పటివరకూ ఏ ఖైదీలో కూడా కరోనా లక్షణాలు కనిపించలేదని అన్నారు. అంతేకాకుండా తామందరం తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. మరోవైపు పెరోల్ పై కొందరు ఖైదీలను విడుదల చేయాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది.

ఇక పలు దేశాల్లోని జైళ్లలో ఎన్నో విపత్కర పరిస్థితులు నెలకొన్న ఘటనలు బయటకు వచ్చాయి. ఒకరినొకరు కొట్టుకోవడం.. చంపుకోవడం వరకూ వెళ్ళింది. అలాంటి ఘటనలు భారత్ లో చోటుచేసుకోకుండా ఉండేందుకు అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు.

Next Story