లోకంలో మానవత్వం మంట కలిసిపోతోంది. కరోనాతో ఓ మహిళ మృతి చెందితే ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలు, వజ్రాలు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఓ మహిళకు కరోనా సోకడంతో రెండు రోజుల క్రితం బంజారహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. కాగా.. చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. అయితే.. మృతదేహంపై ఉన్న బంగారు నగలు, వజ్రాల చెవి కమ్మలు, ముక్కుపుడక మాయం అయినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి ఆస్పత్రి వర్గాలను అడుగగా.. వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో వారు బంజారహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 1891 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 540 మంది మృత్యువాత పడ్డారు. మొత్తం నమోదు అయిన కేసుల్లో 47,590 కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కాగా.. 18,547 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *