'నాన్న ఇంటికి రావొద్దు..' అంటూ తండ్రికి చిన్నారి లేఖ
By తోట వంశీ కుమార్
కరోనా వైరస్(కొవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వల్ల 25వేల మందికి పైగా మృత్యువాత పడగా.. 5లక్షల మందికి పైగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం 21 రోజులు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక భారత్ లోనూ కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. నేటి సాయంత్రానికి దేశ వ్యాప్తంగా 840 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
లాక్‌డౌన్ ఉన్నప్పటికి ఇప్పటికీ ప్రజలు బయటకు వస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఎక్కడికక్కడే బందీలయ్యారు. కుటుంబానికి దూరంగా ఉంటూ వేరే నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కూడా ఆయా నగరాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీనివల్ల వారి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అని కలవరపడుతున్నారు. వారి బాగోగులు చూసుకొనేందుకు నగరాల నుంచి స్వగ్రామాలకు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ సందేశాత్మక వీడియోను ట్విట్టర్‌లో విడుదల చేశారు.
ఈ వీడియోలో ఓ చిన్నారి తన తండ్రికి ఓ లేఖను రాసింది. తన తండ్రి లాక్‌డౌన్ కారణంగా ముంబాయిలో చిక్కుకుపోతాడు. అయితే.. తన తండ్రికి బయటకు రావద్దని.. బయటకు వస్తే కరోనా వైరస్ గెలిచిపోతోందని అందులో పేర్కొంటుంది. ‘‘నాన్న.. మిమ్మల్ని నేను అస్సలు మిస్ కావడం లేదు. అమ్మ కూడా మిస్ కావడం లేదు. మీరు ఇప్పటికిప్పుడు ముంబయి నుంచి ఇంటికి వచ్చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి. మీరు బయటకు వస్తే.. కరోనా గెలిచిపోతుంది. మనం కరోనాను ఓడించాలి’’ అని ఆ చిన్నారి లేఖలో పేర్కొన్నట్లు వీడియోలో చూపించారు.
ఈ వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూస్తే ప్రతి ఒక్కరికీ లాక్‌డౌన్‌పై అవగాహన కలుగుతుంది. కరోనాపై విజయం సాధించడమే మన కర్తవ్యమని ప్రధాని ఈ వీడియో ద్వారా తెలియజేశారు.
�