జాలర్లకు దొరికిన 780 కేజీల చేప.. ఎంతకు అమ్మారంటే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 1:11 PM GMT
జాలర్లకు దొరికిన 780 కేజీల చేప.. ఎంతకు అమ్మారంటే..!

బెంగాల్ కు చెందిన జాలర్లకు దిఘా తీర ప్రాంతంలో ఓ భారీ చేప దొరికింది. దాదాపు 780 కిలో గ్రాముల బరువు ఈ చేప తూగింది. స్థానికులు ఈ చేపను 'శంకర్ చేప' అని పిలుస్తారు. ఏనుగు చెవి ఆకారంలో ఈ చేప ఉండడంతో అలా పిలుస్తారు. 8 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు ఉంటుంది ఈ చేప. 50000 రూపాయలకు ఈ చేపను అమ్మారు.

ఉదయ్ పూర్ బీచ్ కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దిఘా ప్రాంతంలో ఈ చేప దొరికింది. తమ జీవితంలో ఇలాంటి చేపను చూడలేదని జాలర్లు చెప్పుకొచ్చారు.

ఈ చేపను మంటా రే అని పిలుస్తారు. 'రే' జాతి చేపలకు చెందినది ఈ చేప..! తూర్పు భారత తీర ప్రాంతాల్లో ఈ చేపను శంకర్ చేప అని పిలుస్తూ ఉంటారు. ఈ చేప దొరికిన ప్రాంతాన్ని జాలర్లు అధికారులకు తెలిపారు.

ఈ చేపను చూడడానికి పెద్ద ఎత్తున స్థానికులు ముందుకు వచ్చారు. వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. బెంగాల్ ప్రజలు శంకర్ చేపను బాగా ఇష్టంగా తింటారట..! బాగా ఎదిగిన మంటా రే జాతి చేపలు దాదాపు 300 కేజీలు ఉంటాయి.. మార్చి నెలలో కూడా జాలర్లకు ఈ చేప ఒకటి లభించింది.

Next Story