అయోధ్య భూమిపూజ : ప్రధాని మోదీ పాల్గొననుండడంపై ఒవైసీ అభ్యంతరం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 July 2020 11:08 AM GMT
అయోధ్య భూమిపూజ : ప్రధాని మోదీ పాల్గొననుండడంపై ఒవైసీ అభ్యంతరం

భారతదేశంలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం త్వరలో జరగబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆలయ నిర్మానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్య పర్యటన ఖరారు అయింది. ఆగస్ట్‌ 5న ఉదయం అయోధ్యలో జరిగే రామాలయం నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారని సోమవారం ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రధాని పర్యటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఓ వర్గానికి చెందిన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోదీ వ్యవహరిస్తున్నారన్నారు. లౌకిక సూత్రానికి కట్టుబడి విధులు నిర్వర్తిస్తానంటూ.. రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ప్రధానిగా బాధ్యతలు స్పీకరించారని, ఇప్పుడు ఆ ప్రమాణాన్ని ఉల్లంఘింస్తున్నారని మండిపడ్డారు. భూమి పూజకు అధికారిక హోదాలో ప్రధాని హాజరైతే అది కచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమే అవుతుందని వ్యాఖ్యానించారు. 400 ఏళ్లుగా అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీదును ఓ నేరస్థుల సమూహం 1992లో కూల్చివేసిన సంఘటనను తాము మర్చిపోలేమని ట్వీట్‌ చేశారు.

ఆగస్ట్‌ 5న అయోధ్యలో జరిగే భూమి పూజ కార్యక్రమంలో 250 మంది అతిధులు పాల్గొననున్నారు. రామాలయ పూజ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందువులు పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టిని అయోధ్యకు తీసుకువస్తున్నారు. కోవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా భూమిపూజ నిర్వహిస్తున్నామని, ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్‌ క్షేత్ర ట్రస్ట్‌ చైర్మన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఇదిలావుంటే రామాలయం ఎత్తు మరింత పెరగనుంది. 161 అడుగుల ఎత్తున దీనిని నిర్మించాలని నిర్ణయించినట్లు ఆలయ శిల్పి నిఖిల్‌ సోమ్‌పుర వెల్లడించారు. ఈయన ఆలయ ప్రధాన శిల్పి చంద్రకాంత్‌ సోమ్‌పుర కుమారుడు.



Next Story