నంద్యాలలో లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ లీక్‌.. ఒకరి మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jun 2020 12:43 PM IST
నంద్యాలలో లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ లీక్‌.. ఒకరి మృతి

విశాఖ ఎల్‌జీ గ్యాస్‌ లీక్‌ ఘటన మరువక ముందే ఏపీలో మరో గ్యాస్‌ లీక్‌ ఘటన కలకలం రేపింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణ శివారులో ఉన్న ఎస్పీవై ఆగ్రోస్‌ కంపెనీలో లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ లీక్‌ అయింది. ఈ ఘటనలో జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ రెడ్డి మృతి చెందగా.. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. గ్యాస్‌ను అదుపు చేయడానికి ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. రెండు టన్నుల లిక్విడ్ కార్బన్ డయాక్సడ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆగ్రో ప్లాంట్‌ చుట్టూ గ్యాస్‌ వ్యాపించింది. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

గ్యాస్ లీక్ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ అక్కడకు చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్యాస్‌ లీకేజీ కంపెనీలో మాత్రమే ఉందని, లీకైన గ్యాస్‌ బయటికి వ్యాపించలేదన్నారు. గ్యాస్‌ లీకేజీని అరికట్టడానికి అన్ని సేప్టీ చర్యలను తీసుకున్నామన్నారు. లీకేజీని అరికట్టడానికి అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్‌, వైద్య శాఖ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టాయన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.

Next Story