భారీగా పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. రూ. 145 పెంపు
By సుభాష్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ గ్యాస్ వినియోగదారులకు షాకిచ్చింది. గ్యాస్ సిలిండర్ ధర పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సబ్సిడీయేతర వంట గ్యాస్ ధర భారీగా ఎగబాకింది. వరుసగా పెరుగుతూ వస్తున్న సిలిండర్ ధర మరోసారి దూసుకుపోయింది. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం .. మెట్రో నగరాల్లో భారీగా పెరిగిన ఎల్పీజీ ధరలు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీలో 14.2కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 144.5, ముంబాయిలో రూ. 145 వరకు పెంచినట్లు ఇండేన్ పేరుతో సిలిండర్లను సరఫరా చేసే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. తాజాగా ధరల పెంపుతో సబ్సిడీయేతర ఎల్పీజీ ధరలు ఢిల్లీలో రూ. 858 కాగా, ముంబాయిలో రూ.829, చెన్నైలో రూ.881, కోల్‌కతాలో రూ.896కు చేరుకుంది. కాగా, ప్రతి యేటా 12 సిలిండర్లను సర్కార్ అందిస్తుండగా, అదనపు సిలిండర్ కావాలనుకుంటే మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఎల్పీజీ ధరలు, రూపాయి మారకం రేటు ఆధారంగా సర్కార్ నెలవారిగా సబ్సిడీని వినియోదారులకు అందిస్తోంది.
ఇండియాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ముఖ్యంగా రెండు ఫ్యాక్టర్స్ పై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎల్పీజీ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ రేటు, రెండోది రూపాయితో డాలర్ మారకం విలువపై ఆధారపడి ఉంటుంది.
కాగా, 19కిలోల ఎల్పీజీ గ్యాస్ ధరను ఫిబ్రవరి 1న పెరిగింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండరధ్ ధర ఏకంగా రూ.225 ఎగబాకింది. ఇప్పుడు సిలిండర్ ధర రూ.1,550కు చేరింది.