వైసీపీలో చేరిక‌కు గంటా ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారా.?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Oct 2020 1:34 PM GMT
వైసీపీలో చేరిక‌కు గంటా ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారా.?

టీడీపీ నేత, మాజీమంత్రి,‌ విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడేందుకు ఎట్ట‌కేల‌కు ముహూర్తం సిద్ధం చేసుకున్నారనే వార్త‌లు గుప్పుమంటున్నాయి. గ‌త కొద్దికాలంగా ఆయ‌న టీడీపీని వీడి వైసీపీలో చేర‌తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ.. ఎప్పుడు చేర‌తార‌నేదానిపై క్లారిటీ లేకుండాపోయింది.

అయితే.. తాజాగా గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరిక‌పై ముహుర్తం ఫిక్స్ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేర‌కు ఆయ‌న అక్టోబ‌ర్‌ 3న వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను కలవబోతున్నార‌నేది ప్ర‌చారంలో ఉన్న వార్త‌ల యొక్క‌ సారాంశం. అదే రోజు గంటా త‌న‌ కుమారుడితో క‌లిసి వైసీపీ కండువా క‌ప్పుకోనున్నార‌ని చ‌ర్చ‌జ‌రుగుతోంది.

ఇక వైసీపీలో చేరిక‌పై గంటా కానీ.. వైసీపీ వ‌ర్గాలు కానీ ఎటువంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఈ అపోహ‌ల‌న్ని వీడాలంటే గంటా నోరు విప్ప‌క త‌ప్ప‌ద‌నే వాద‌నలు వినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే.. 2014లో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్‌ను వీడిన గంటా..‌ టీడీపీలో చేరారు. అనంత‌రం 2014, 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున పోటీచేసి గెలిచారు. గ‌త‌ టీడీపీ హ‌యాంలో గంటా విద్యాశాఖ‌ మంత్రిగా కూడా ప‌నిచేశారు. తొలినాళ్ల‌లో టీడీపీలోనే ఉన్న గంటా.. ఆ త‌ర్వాత 2009 స‌మ‌యంలో ప్ర‌జారాజ్యంలో చేరారు. ఆ పార్టీ విలీనంతో కాంగ్రెస్ నేత‌గా 2014 వర‌కు కొన‌సాగారు.

Next Story