నా కొడుకును కాల్చి చంపేయండి.. వికాస్‌దూబే తల్లి
By తోట వంశీ కుమార్ Published on 4 July 2020 12:28 PM GMTకాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగస్టర్ వికాస్ దూబే తల్లి సరళాదేవి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు చేసింది చాలా తప్పు.. అతడిని కాల్చి చంపండి అని వ్యాఖ్యలు చేశారు. కాన్పూర్‌లో డీఎస్పీతో సహా 8 మంది పోలీసులను వికాస్ దూబే గ్యాంగ్ కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై వికాస్ దూబే తల్లి సరళాదేవి స్పందించారు. ఎనిమిది మంది పోలీసులను చంపి తన కుటుంబాన్ని అప్రతిష్టపాలు జేసిన తన కుమారుడిని కాల్చి చంపాలంటూ తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. వెంటనే పోలీసులకు లొంగిపోవాలని దూబేను కోరారు. లేదంటే.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చావు తప్పదని హెచ్చరించారు.
అమాయక పోలీసులను చంపడం ద్వారా అతను చాలా చెడ్డ పని చేశాడు. నేను టీవీలో ఎన్‌కౌంటర్ వార్తలను చూశాను. అతడు తన మంచి కోసం బయటకు వచ్చి పోలీసులకు లొంగిపోవాలని నేను కోరుకుంటున్నాను, లేకపోతే పోలీసులు అతన్ని ఎలాగైనా కనుగొంటారు. అతన్ని పట్టుకొని ఆపై ఎన్‌కౌంటర్ చేయండి. నా కుమారుడిని శిక్షించాలి అని వికాస్ దూబే తల్లి సరళాదేవి కోరారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడిన తర్వాతే.. దూబే నేరాలకు పాల్పడటం మొదలు పెట్టారని ఆమె చెప్పారు. ఈ నేరాలు తమ కుటుంబానికి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తున్నాయని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో గెలవాలనేది వికాస్ లక్ష్యం. అందుకోసం సంతోష్ శుక్లా అనే బీజేపీ నాయకుడిని కాల్చి చంపాడు. నాలుగు నెలల పాటు దూబేతో మాట్లాడలేదు. లఖ్‌నవూలోని ఉంటున్న తన చిన్న కుమారుడితో ఉంటున్నానని సర్లా దేవీ పేర్కొన్నారు.
రౌడీషీటర్ వికాస్‌దూబేను పట్టుకునేందుకు గురువారం అర్థరాత్రి పోలీసులు వెళ్లగా.. ఓ ఇంటిపై మాటువేసిన దుండగులు పోలీస్ బృందంపై బులెట్ల వర్షం కురింపించారు. దీంతో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా సహా ముగ్గురు ఎస్సైలు, నలుగురు కానిస్టేబుళ్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 60కేసుల్లో వికాస్‌దూబే నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.