'మర్డర్'‌ మూవీ.. వర్మపై కేసు నమోదు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 July 2020 11:47 AM GMT
మర్డర్‌ మూవీ.. వర్మపై కేసు నమోదు

నిత్యం వివాదాలతో సావాసం చేసే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్‌ హత్య కేసు ఆధారంగా మర్డర్‌ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం పై ప్రణయ్‌ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చిత్రం తన కొడుకు హత్య కేసును ప్రభావితం చేసే విధంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో.. రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు చేయాలని మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులను కోర్టు ఆదేశించింది.

ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాల మేరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత నట్టి కరుణలపై శనివారం కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాథ్‌ తెలిపారు. బాలస్వామి ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో మిర్యాలగూడ వన్‌టౌన్‌ సిఐ సదా నాగరాజు రాంగోపాల్ వర్మతో పాటు, మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఫాదర్స్ డే రోజున ‘మర్డర్’ పోస్టర్‌ను రిలీజ్ చేసిన ఆర్జీవీ.. ప్రణయ్ భార్య అమృత, ఆమె తండ్రి మారుతీరావు విషాదగాదపై సినిమా తీస్తున్నట్లుగా ప్రకటించారు. కూతురును అతిగా ప్రేమిస్తే వచ్చే ప్రమాదాలు ఏంటన్న దానిపై తన సినిమా కథాంశం ఉంటుందంటూ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే పలు విమర్శలు వెల్లువెత్తినా.. కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ మాత్రం సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మరీ ఇప్పుడు ఈ కేసుపై వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Next Story