ఎవరీ వికాస్ దూబే.. పోలీసులనే చంపగలిగే క్రిమినల్ గా ఎలా ఎదిగాడు..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 July 2020 9:12 AM GMT
ఎవరీ వికాస్ దూబే.. పోలీసులనే చంపగలిగే క్రిమినల్ గా ఎలా ఎదిగాడు..?

ఉత్తరప్రదేశ్ రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు పోలీసులు గత రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపడుతూ కాన్పూర్‌ సమీపంలోని అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి అర్థరాత్రి వెళ్లారు. అతని నివాసానికి పోలీసులు చేరుకుంటున్న క్రమంలో ఓ ఇంటిపై మాటు వేసిన దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు.ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాసహా మొత్తం 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనతో వికాస్ దూబే పేరు దేశవ్యాప్తంగా సంచలమైంది. వికాస్ దూబే కాన్పూర్ ప్రాంతంలో పేరు మోసిన నేరస్థుడు. 60కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడు, మర్డర్ కేసులు కూడా అతడి మీద ఉన్నాయి. ఎన్నో సార్లు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. చట్టం కళ్లుగప్పి ఎలాగోలా తప్పించుకుంటూ వస్తున్నాడు. 50 సంవత్సరాల వికాస్ దూబే తనకంటూ ఓ గ్యాంగ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. డిక్రూ గ్రామంలో వికాస్ దూబే ఉంటున్నాడు. ఇది లక్నోకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామంలోకి పోలీసులు ప్రవేశించకుండా అడ్డుగా రాళ్లను కూడా పెట్టారు. దీంతో పోలీసులు బుల్డోజర్ సహాయంతో గ్రామంలోకి వెళ్లారు.

పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకుని గ్రామంలోని ఇళ్లపైకి చేరుకున్న క్రిమినల్స్ ఒక్క సారిగా పోలీసుల మీదకు తూటాల వర్షం కురిపించారు. ఎనిమిది మంది పోలీసులు ఆ ఘటనలో మరణించారు. ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వికాస్ దూబే ఇంటికి వెళ్లాలని అనుకున్న పోలీసులు రక్తపుమడుగులో ఉండిపోయారు.

వికాస్ దూబే క్రిమినల్ రికార్డు 1990లో మర్డర్ కేసుతో మొదలైంది. ఆ తర్వాత అటెంప్టింగ్ మర్డర్, కిడ్నాపింగ్, దోపిడీలు, అల్లర్ల కేసుల్లో నిందితుడు. 2001 లో సంతోష్ శుక్లా అనే బీజేపీ లీడర్ ను పోలీసు స్టేషన్ లో కాల్చి చంపినా ఘటన అప్పట్లో సంచలనమైంది. 2002 లో ఈ కేసులో అప్పట్లో సరెండర్ అయ్యాడు దూబే. ఇటీవల గ్రామస్థుడు ఇచ్చిన ఫిర్యాదు విషయంలో పోలీసులు మూడు టీమ్ లతో గ్రామంలోకి ప్రవేశించాలని అనుకోగా ఈ మారణహోమం జరిగింది.

వికాస్ దూబేకు పొలిటికల్ లింక్స్ ఉన్న కారణంగానే ఇన్నాళ్లూ తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వికాస్ దూబే తనకంటూ ప్రత్యేకంగా ఒక ఆర్మీ లాంటిది ఏర్పాటు చేసుకున్నాడని గతంలోనే చాలా మంది చెప్పుకొచ్చారు. దూబేను పట్టుకోడానికి వెళ్లాలని అనుకున్నప్పుడల్లా ఏదో విధంగా పోలీసులకు ఎవరో ఒకరు అడ్డుపడుతూ వచ్చారు. ఈసారి అన్యాయంగా ఎనిమిది మంది పోలీసులు బలయ్యారు.

Next Story
Share it