ఏపీ: ఆ మూడు మండలాల్లో సంపూర్ణ లాక్‌డౌన్
By సుభాష్ Published on 31 July 2020 7:37 PM ISTఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నాయి.
ఇప్పుడు రాష్ట్రాల వారిగా కాకుండా జిల్లాలు, మండలాల వారిగా సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉండటంతో కట్టడికి మరింత ఆంక్షలు చేపట్టింది ఏపీ సర్కార్. జిల్లాలోని మూడు మండలాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో సంపూర్ణ లాక్‌డౌన్ విధించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
అవనిగడ్డ సర్కిల్ పరిధిలోని మూడు మండలాల్లో ఆగస్టు 3 నుంచి 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. ఉదయం 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకులకు అనుమతి ఇచ్చారు. నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు మండలాల్లో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు.