Fact Check : రఫేల్ విమానాలు అందుకున్న భారత్ కు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Aug 2020 5:03 PM IST
Fact Check : రఫేల్ విమానాలు అందుకున్న భారత్ కు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారా..?

అత్యంత శక్తివంతమైన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌లో ఇటీవలే దిగాయి. ఫ్రాన్స్‌ నుంచి బయలుదేరిన ఐదు రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌ హర్యానాలోని అంబాలా ఎయిర్‌ బేస్‌లో సురక్షితంగా దిగాయి. ఇండియా గడ్డపై రఫేల్‌ యుద్ధ విమానాలు దిగడంతో మిలటరీ చరిత్రలో నవశకం మొదలైందని పలువురు అభిప్రాయపడ్డారు.

మొదటి బ్యాచ్ రఫేల్ యుద్ధ విమానాలను భారత్ అందుకున్నందుకు గానూ.. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారు అంటూ ఓ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. “Congratulations INDIA. Finally, we have delivered the first batch of Rafale jets to you” అని ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ పోస్టు చేసినట్లు ట్వీట్ ట్విట్టర్ లో వైరల్ అవుతోంది.

జులై 29న భారత్ మొదటి విడతగా అయిదు రఫేల్ విమానాలను అందుకున్నాయి. అందుకు ఆయన 'కంగ్రాచులేషన్స్ ఇండియా.. మేము మొదటి బ్యాచ్ రఫేల్ జెట్స్ ను మీకు అందించాం' అన్న ట్వీట్ వైరల్ అవుతోంది. మొత్తం 36 విమానాల డీల్ ను భారత్ ఫ్రాన్స్ తో చేసుకున్న సంగతి తెలిసిందే..!

నిజ నిర్ధారణ:

రఫేల్ విమానాలు అందుకున్న భారత్ కు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారన్నది 'అబద్ధం'.

అయన నిజంగానే ఈ పోస్టును పెట్టారా లేదా అన్నది తెలుసుకోడానికి ట్విట్టర్ లో “Emmanuel Macron” ను సెర్చ్ చేయగా రెండు ప్రొఫైల్ లు ఒకటే ఫోటోతో లభించాయి. అందులో ఉన్నది ఎమ్మాన్యుయేల్ మాక్రాన్.

ఆ రెండు ట్విట్టర్ ప్రొఫైల్స్ లో ఒక ప్రొఫైల్ కు ట్విట్టర్ బ్లూ టిక్ ఉండగా.. మరొక దానికి ట్విట్టర్ వెరిఫికేషన్ లేదు. అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఆయన భారత్ కు అభినందనలు తెలుపుతూ పెట్టిన పోస్టు కనిపించలేదు. ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ అఫీషియల్ అకౌంట్ లో ఈ పోస్టు కనిపించలేదు.

ఆయన జూన్ 29న పోస్టు చేసిన ట్వీట్ ఇదే..

వైరల్ అవుతున్న పోస్టు గురించి చూడగా.. అది ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ పేరడీ అకౌంట్ అని తేలింది. అందులో మాత్రమే వైరల్ అవుతున్న ట్వీట్ ఉంది. జులై 29న ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ పేరడీ అకౌంట్ లో రఫేల్ కు సంబంధించిన ట్వీట్ చేశారు.

ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ వెబ్సైట్ ప్రకారం 'ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ ఈ ట్విన్-జెట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ను రూపొందించింది. ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధాలను ప్రయోగించగల సత్తా ఈ రఫేల్‌కు ఉంది. 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లే సత్తా ఉంది. అణు క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఈ రఫేల్‌ ఫైటర్‌ జెట్లకు ఉంది. రఫేల్‌లో రెండు రకాల క్షిపణులు ఉంటాయి. ఒకదాని సామర్థ్యం 150 కిలోమీటర్లు. రెండో దాని సామర్థ్యం సుమారు 300 కిలోమీటర్లు. అంతేకాదు రఫేల్‌ గాలిలో నుంచి గాలిలో 150 కిలోమీటర్ల దూరం వరకూ క్షిపణిని ప్రయోగించే సత్తా ఉంటుంది. గాలిలో నుంచి భూమిపైకి 300 కిలోమీటర్ల వరకు క్షిపణిని ప్రయోగిస్తుంది. ఇక ఈ యుద్ధ విమానం గంటకు 1389 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. వీటి ఎత్తు 5.30 మీటర్లు, పొడవు 10.30 మీటర్లు.' ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను ఫ్రెంచ్ నేవీ, ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ కోసం తయారుచేశారు.

ఆఫ్ఘనిస్థాన్, మాలి, లిబియా, సిరియా, ఇరాక్ లలో ఈ విమానాలు ఆపరేషన్లను చేపట్టాయి. ఈ విమానాలు ఇప్పటికే కొన్ని దేశాలు వినియోగిస్తూ ఉన్నాయి. ఈజిప్టు, ఖతర్, భారత్ దేశాలు ఈ విమానాలకు ఆర్డర్ ను ఇచ్చాయి. ఫ్రెంచ్ నేవీలో రఫేల్ విమానాలు 2004 నుండి సేవలు అందిస్తూ ఉండగా.. 2006 లో ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ లో రఫేల్ భాగమైంది.

రఫేల్ విమానాలు అందుకున్న భారత్ కు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అభినందనలు తెలిపారన్నది 'అబద్ధం'. వైరల్ అవుతున్న ట్వీట్ పేరడీ అకౌంట్ నుండి వచ్చింది.

Next Story