ముఖ్యాంశాలు

  • సుమారు 120 ఏళ్ల క్రితం ఫాక్స్‌ చెరువు నిర్మాణం
  • పారిశ్రామిక వ్యర్థాలతో కాలుష్య కాసారంగా మారిన ఫాక్స్‌ సాగర్‌
  • అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికుల ఆరోపణ

ఒకప్పుడు వందల చెరువులతో కళకళలాడిన హైదరాబాద్‌ మహానగరంలో.. నేడు చెరువుల సంఖ్య వెళ్లమీద లెక్కబెట్టే స్థితికి వచ్చింది. అప్పట్లో తాగునీరు అందించిన ఆ చెరువులు ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అలాంటి వాటిలోదే ఫాక్స్‌ చెరువు. అధికారులు, ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశమున్న.. ఫాక్స్‌ చెరువు నిర్లక్ష్యం కారణంగా కనుమరుగయ్యే స్థితికి వచ్చింది.

ఫాక్స్‌ చెరువకు ఒకవైపు జీడిమెట్ల, మరోవైపు కొంపల్లి ప్రాంతాలు ఉన్నాయి. జీడిమెట్ల వైపు ఎక్కువ ఫ్యాక్టరీలు ఉన్నాయి. రామిరెడ్డి నగర్‌, జీడిమెట్ల పారిశ్రామిక వాడ, ఫేజ్‌-5, దూలపల్లి ప్రాంతాల్లో వందల సంఖ్యలో పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ఫార్మా, బల్క్‌, డ్రగ్‌ కంపెనీలతో పాటు ఇతర ఇంజినీరింగ్‌ కంపెనీలు ఉన్నాయి. అయితే ఈ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు వెళ్లేందుకు ప్రత్యేకించి ఎలాంటి మార్గం లేదు. దీంతో వర్షకాల సమయంలో వచ్చ వరదనీటితో పాటు రోజు మురుగునీరు, కెమికల్‌ వ్యర్థాలు చెరువులోకి చెరుతున్నాయి. దీంతో ఫాక్స్‌ పూర్తిగా కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది.

ఇంత జరుగుతున్న ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని స్థానిక ప్రజలు వాపోతున్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నీళ్లు లేని ప్రాంతంలో కొన్ని ఇంజినీరింగ్‌ కంపెనీలు తమ పనులను నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ సామాగ్రిని తయారు చేస్తున్నారు. వాటికి వేసే పెయింటింగ్‌ వంటి వ్యర్థాలను చెరువులో పడబోస్తున్నారు. ఇదిలా ఉంటే కొన్ని పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను ఎఫ్‌టీఎల్‌ ప్రాంతానికి తీసుకొచ్చి కాల్చివేస్తున్నారు.

Fox sagar lake

ప్రస్తుతం ఎఫ్‌టీఎల్‌ ప్రాంతం చెత్తచెదారంతో డంపిగ్‌ యార్డ్‌ను తలపిస్తోంది. జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఏర్పాటై దశాబ్దాలు గడుస్తున్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యర్థాలను చెరువులో కలవకుండా చేయడంలో అన్ని ప్రభుత్వాలు విఫలం అయ్యాయి. నీటి పారుదల శాఖ లెక్కల ప్రకారం ఫాక్స్‌ సాగర్‌ చెరువు విస్తీర్ణం 482.26 ఎకరాలు. మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థ పదార్థాలు, కెమికల్స్‌ను చెరువులోకి రానియకుండా ప్రస్తుతం రూ.7 కోట్ల వ్యయంతో డైవర్షన్‌ చానల్‌ను నిర్మిస్తున్నామని నీటి పారుదలశాఖ ఏఈ రామారావు తెలిపారు.

చెరువులోకి చెరుతున్న వ్యర్థాలపై పీసీబీకి, టౌన్‌ప్లానింగ్‌కు, కబ్జాలపై రెవెన్యూశాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే చెరువు పరిరక్షణ విషయంలో తమకు పూర్తి స్థాయిలో అధికారాలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని రామారావు తెలిపారు. ఇప్పటికే కంపెనీలకు నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. చెరువు కట్టపై అభివృద్ధితో పాటు సుమారు 10 కీ.మీటర్ల మేర వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కాగా ఇప్పటికే ఫాక్స్‌ చెరువును చాలా మంది కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.