ఈ మధ్య కాలంలో హైదరాబాద్ నగరంలో కూడా కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్యాన్ని తగ్గించడానికి ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ లను చేపట్టింది. ఇటీవలే భాగ్యనగరంలో కాలుష్యం లేని ప్రాంతాలు.. గాలిలో స్వచ్ఛత ఉన్న ప్రాంతాలకు సంబంధించి ఓ జాబితాను విడుదల చేసింది. TSPCB నివేదిక ప్రకారం మహానగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతం లోని ప్రజలు స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్నారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ ఉన్న ప్రాంతం ఎక్కువ కాలుష్యంతో కూడుకున్నదట..! TSPCB గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో 24 మోనిటరింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేసి.. వాతావరణంలోని కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు రికార్డు చేయిస్తోంది.

రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఎక్కువగా ఇళ్ళు ఉండడం, అలాగే ప్రొఫెస్సర్ జయ శంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లాంటి సంస్థలు ఉండడంతో వాతావరణంలో కాలుష్యం చాలా వరకూ తక్కువగానే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) సూచీ ప్రకారం గత ఏడాది చాలా వరకూ ‘గుడ్’.. ‘శాటిస్ఫ్యాక్టరీ’.. అనే లిమిట్ లోనే ఉంది.

AQI లెవెల్స్ ప్రకారం సూచీ  0-50 మధ్య ఉంటే ‘గుడ్’ అనీ.. 51-100 మధ్య ఉంటే ‘శాటిస్ఫ్యాక్టరీ’… 101-200 మధ్య ఉంటే ‘మోడరేట్’, 201-300 మధ్య ‘పూర్’ , 301-400 ‘వెరీ పూర్’.. 400 దాటింది అంటే ‘Severe’ గానూ విభజించారు. 2019 లో రాజేంద్రనగర్ లో జనవరి నెలలో ఎయిర్ క్వాలిటీ 91 ఉండగా.. జులై నెలలో 35 నమోదయ్యింది.  జూన్ నెల నుండి అక్టోబర్ వరకూ ఆ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ‘గుడ్’ లిస్టు లోనే ఉండడం విశేషం. కేబీఆర్ పార్క్, శామీర్ పేట్, సైనిక్ పురి ప్రాంతాల్లో గుడ్-శాటిస్ఫ్యాక్టరీ మధ్య ఎయిర్ క్వాలిటీ ఉంది.

కాలుష్యం ఎక్కువగా పెరగడానికి ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న వాహనాలు కూడా కారణమే..! రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఎక్కువగా కాలుష్యం లేకపోవడానికి వాహనాల రాకపోకలు ఎక్కువగా లేకపోవడమేనని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో చెట్ల సంఖ్య ఎక్కువగా ఉండడం కూడా కాలుష్యం అతి తక్కువ ఉండడానికి కారణమని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. జూ పార్క్ ప్రాంతంలో ఎక్కువగా వాహన రాకపోకలు ఉండడమే కాకుండా.. ఆ ప్రాంతం నుండి ఇండస్ట్రీలు మొదలవ్వడం కూడా కాలుష్యం ఎక్కువగా కనిపిస్తోంది. గత ఏడాది జూ పార్క్ ప్రాంతం చాలా వరకూ ‘పూర్’ లిస్టులోనే ఉంది. AQI లో గత ఏడాది గరిష్టంగా 234 ఆ ప్రాంతంలో నమోదయింది. రుతుపవనాల సమయంలో జూ పార్క్ ప్రాంతంలో కాలుష్యం కాస్త తక్కువగానే ఉంది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఉప్పల్, జూబిలీ హిల్స్, ఎంజిబిఎస్, కూకట్ పల్లి, చార్మినార్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండడంతో వాయు కాలుష్యం కాస్త అధికంగానే ఉంది. రుతుపవనాల సమయంలో ఎయిర్ క్వాలిటీలో ‘శాటిస్ఫ్యాక్టరీ’ నమోదవ్వగా.. శీతాకాలంలో మాత్రం పొగ మంచు కారణంగా గాలిని పీల్చడం కాస్త కష్టంగా ఉండేదని తెలుస్తోంది.

ఎక్కువగా పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో గాలి క్వాలిటీ చాలా వరకూ తగ్గింది. AQI ప్రకారం బాలానగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాయు కాలుష్యం చాలా ఎక్కువవుతోంది. సెప్టెంబర్ నెలలో 85 ఉండగా.. డిసెంబర్ నెలలో ఏకంగా 145కు చేరుకుంది. అదే సమయంలో సనత్ నగర్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. AQI లెవెల్స్ 51 నుండి ఒక్కసారిగా 176కు చేరుకుంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.