పేలుళ్ల కుట్రను ఛేదించిన ఢిల్లీ పోలీసులు
By సుభాష్ Published on 5 Oct 2020 3:30 PM ISTదేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్ల కుట్రను బట్టబయలు చేశారు పోలీసులు. దుర్గా పూజ సందర్భంగా పేలుళ్లకు కుట్ర పన్నిన నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కుట్ర పన్నిన ఉగ్రవాదులంతా గజవత్ ఉల్ హింద్‌కు చెందినవారుగా గుర్తించారు. అల్-ఖైదా ఇటీవల గజవత్ ఉల్ హింద్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు గత నెల 29న ఢిల్లీకి వచ్చారు. రానురాను మార్గమధ్యంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి సేకరించారు. ఇంటెలిజెన్స్ సంస్థలు వీరి రాకను పసిగట్టి ఢిల్లీ పోలీసులకు, భద్రతా బలగాలకు సమాచారం అందించి అప్రమత్తం చేసింది. ఈ ఉగ్రవాదులు ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. వీరి నుంచి నాలుగు పిస్టల్స్, 120 క్యాట్రిడ్జులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నలుగురు ఉగ్రవాదులు దసరా పర్వదినం రోజున దుర్గా పూజకు ముందు ఢిల్లీలో పేలుళ్లు సృష్టించాలని ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఈ నలుగురిని కోర్టులో హాజరు పర్చనున్నారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో ముందస్తుగా పోలీసులు అప్రమత్తం కావడంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది.