విశాఖలో విషాదం: ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ఆత్మహత్య
By సుభాష్ Published on 10 Sept 2020 9:49 AM ISTవిశాఖ నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. అప్పుల బాధలు తాళలేక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ లాడ్జిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులంతా పెందుర్తి శివారు బంధుపాలెంకు చెందిన బి.అప్పలరాజు కుటుంబంగా గుర్తించారు. అప్పలరాజు కుటుంబం ఇటీవలో లాడ్జిలో గదిని అద్దెకు ఈ దారుణానికి పాల్పడింది. ఆత్మహత్యకు పాల్పడిన వారిలో అప్పలరాజు, భార్య మానస, కుమారుడు సాత్విక్ (5), కుమార్తె కీర్తి (6) ఉన్నారు.
గతనెల 20వ తేదీ నుంచి అప్పలరాజు లాడ్జిని అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 1 నుంచి అతని కుటుంబ సభ్యులు కూడా లాడ్జికి వచ్చారు. 9 రోజుల పాటు లాడ్జిలో గడిపిన ఆ కుటుంబం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం రూమ్ బాయ్ వచ్చి తలుపులు తట్టగా ఎంతకి డోర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి కిటికీలోంచి చూడగా, అందరూ విగతజీవులుగా కనిపించారు. దీంతో లాడ్జి వారు పోలీసులకు సమాచారం అందించారు.
వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక..
కాగా, వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆత్మహత్య విషయం అప్పలరాజు బంధువులకు సమాచారం అందించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.