ఉద్యోగం వదలి.. ఉన్నత దారిలో వెలిగి..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 1 Sept 2020 5:05 AM ISTఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కోకొల్లలు. మంచి జీతం వస్తే చాలు ఎలాంటి కష్టమయినా సహిస్తాం...భరిస్తాం అనే వాళ్ళకు కొదవ లేదు. అయితే లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాన్ని ఉన్నపళంగా వదలి.. సాటి వారికోసం ఏదైనా చేయాలని అనుకునే వారు చాలా అరుదు. అలాంటి అరుదైన కోవకు చెందిన మహిళే భావనా తొరూర్. ఉద్యోగం జీతమిస్తుందేమోగానీ తృప్తి కలిగించే జీవితాన్ని ఇవ్వదని భావించి తన ఉద్యోగాన్ని వదలి ఉన్నత దారిలో అడుగులేసింది. ఆధ్యాత్మికతను తన ఆభరణంగా మార్చుకుంది. మహిళల మనసులు గెలవడానికి వారి జీవితానికో వెలుగు దారి చూపడానికి సంసిద్ధురాలయింది.
న్యూయార్క్‌లో అసెట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీలో చక్కని ఉద్యోగం చేస్తున్న భావన...ఒక్కసారిగా ఆ ఉద్యోగ వలయం నుంచి బైటపడింది. అనుక్షణం తీరిక లేనంత బిజీగా ఉన్న తను ప్రస్తుతం తనను తాను పరిశీలించుకోడానికి కాసింత సమయాన్ని వెచ్చిస్తోంది. తనను తాను తెలుసుకోవడంతోపాటు తన లో తాను సత్యాన్వేషణ సాగిస్తోంది. రోజుకు పది గంటలు చొప్పున పది రోజులు ఏకబిగిన విపాసన ధ్యానం చేసిన భావన మనసులో వెలిగిన వెలుగే షినోమిక్స్. భావన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ ధ్యానం సమయంలో మ్యాట్‌పై కూర్చొన్నప్పుడు నా మనసులో మొదట ఏవేవో ఆలోచనలు ముసురుకునేవి. క్రమంగా అవన్నీ మసకబారి మాయమయ్యాయి.
ఈ సమయంలోనే నాకు ఓ విషయం తెలిసొచ్చింది. నాణ్యమైన జీవనం కచ్చతంగా నాణ్యమైన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు నా ముందు నిలిచిన మార్గాలు రెండు. ఒకటి నా మెదడును తన ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వడం. అది ఎక్కడికి వెళ్ళాలన్నా అభ్యంతరం చెప్పక పోవడం. రెండు నా మెదడును నియంత్రించడం. వర్తమానంలోనే ఉండేలా చేయడం. సరైన మార్గంలో నడిచేలా తర్ఫీదునివ్వడం. నాకు రెండో మార్గమే సరి అనిపించింది. తద్వారా నేను వినియోగిస్తున్న ప్రతి సెకను నా మంచి జీవితానికేనా అని పరీక్షించుకోవడం ప్రారంభమైంది. అంతేకాదు ఇతరులకు సేవలందించేందుకు ఆ సమయం ఉపయోగ పడుతోందా అని కూడా తర్కించుకునే దాన్ని’ అంటూ తన మనోభావాలను వివరించింది.
ఈ ప్రయాణంలోనే భావన తన అంతరంతరాల్లో దాగున్న నిజమైన, స్వచ్ఛమైన , ఇన్నాళ్లు తనతోపాటు కొనసాగుతున్న ప్రేమను గుర్తించగలిగింది. ఇపుడు తనను తాను పూర్తిగా హత్తుకోగలుగుతోంది. తనను తానుగా స్వీకరించగలుగుతోంది. అంతేకాదు ఆనందంగా ఉండటానికి ప్రత్యేకంగా సూత్రాలు ఏవీ ఉండవని, ఉన్నతంగా, ప్రశాంతంగా జీవించాలనుకోవడమే ఆనందానికి మూలధాతువని గ్రహించగలిగింది. ఇతరులకు సేవచేయడం ద్వారా అమితానందాన్ని అనుభవించవచ్చని అర్థమైంది.
తనలోని ఆధ్యాత్మిక భావన తనకన్నా తన జీవితం కన్నా పెద్దదని గ్రహించింది. గతంలో యువ ఎంట్రప్రెన్యూర్లను ఉత్తేజ పరచడానికి , వారి మార్గానికి సరైన సలహాలివ్వడానికి దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేది. ఆ సమయంలో తను వెళ్ళిన ప్రతి సమావేశ మందిరంలో మగవాళ్లే అధిక సంఖ్యలో ఉండటం...స్త్రీలు వేళ్ళపై లెక్కించేలా ఉండటాన్ని గమనించేది. ఎప్పటికైనా ఈ అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని అనుకునేది. ఈ భావనలే షినోమిక్స్ స్థాపనకు కారణాలయ్యయా. మహిళలు తమలోని అంతర్గత శక్తి తెలుసుకోడానికి.. సరైన మార్గంలో నడవడానికి ఈ వేదిక ఉపయోగపడుతోంది.
భావన తండ్రి ఐఎఫ్‌ఎస్ ఆఫీసరు కావడంతో ఉద్యోగ రీత్యా విదేశాల్లో ఉండేవారు.. భావన ఇలా ప్రయాణాలు చేస్తూనే పెరిగింది. నాలుగు కాంటినెంట్లలో ఉండే అవకాశం లభించింది. ఒకదానికొకటి సంబంధం లేనంత వైవిధ్యంగా ఉండేవి. భావన తండ్రి తన సర్వీసులో బాంగ్లాదేశ్, ఇండియా, నైజీరియా యూకే యూఎస్ టాంజానియా ప్రాంతాల్లో సేవలందించారు. కుటుంబం ఆయన వెంటే తిరిగేది. భావన తన 19వ ఏట న్యూయార్క్‌కు చదువు కోసం వెళ్ళింది. అక్కడ న్యూయార్క్ యూనివర్సిటీ అనుబంధ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీయే చేసింది.
ఆతర్వాత ఫైనాన్షియల్ రంగంలో మంచి కెరీర్ మొదలెట్టింది. భావన కేవలం చదువుల్లోనే కాకుండా క్రియేటివ్ రంగంలోనూ రాణించింది. 2001న న్యూయార్క్‌లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. మోడలింగ్, డాన్సింగ్, యాక్టింగ్, పబ్లిక్ స్పీకింగ్‌లలో అదరగొట్టేది. అంతేకాదు నేషనల్ చానెల్‌లో నమస్తే అమెరికా అనే ప్రోగ్రామ్‌కు యాంకర్‌గా వ్యవహరించింది. ఈ కార్యక్రమం కింద న్యూయార్క్‌కు వచ్చిన బాలీవుడ్ తారలను ఇంటర్వ్యూ చేసేది.
వివిధ రంగాల్లో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో తన 32వ ఏట భావన కార్పొరేట్ ఉద్యోగం నుంచి అకస్మాత్తుగా నిష్క్రమించింది. ఇక రెండు నెలల్లో బోనస్ వస్తుందని తెలిసీ వదిలేసుకుంది. వెంటనే ఇండియా వచ్చేయాలని నిర్ణయించుకుంది. 2014లో భావన కొత్త జీవితం ప్రారంభించింది.
షినోమిక్స్ గురించి భావన మాట్లాడుతూ..‘ నాయకులుగా ఎదగాలనుకున్న మహిళలకు ఇదో చక్కని వేదిక. మహిళలు సుదృఢ నాయకులుగా ఎదగడానికి కావల్సిన సాయం షినోమిక్స్ అందిస్తోంది. దీని ద్వారా సమాజాన్ని వారు అద్భుతంగా ప్రభావితం చేయగలరు. ఈ సంస్థలో చేపడుతున్న నాయకత్వ విధానాలు, శిక్షణ కార్యక్రమాలు, మెంటరింగ్ కార్యక్రమాలు వివిధ ప్రాంతాల మహిళల్ని ఒక చోట చేర్చడం తదితరాల వల్ల వారు సంపూర్ణంగా వికాసం పొందడానికి వీలు దొరుకుతోంది. ’ అంటూ వివరించారు.
భావన కొత ప్రయాణం ఈ మధ్యనే ప్రారంభమైంది. చాలా దూరం వెళ్ళాల్సి ఉంది. ఎందరో మహిళల్ని చైతన్యవంతులుగా రూపొందించి సమాజానికి ఇవ్వాల్సి ఉంది. తన సమున్నత లక్ష్యం నెరవాలని కోరుకుందాం.