నమ్యజోషి.. నిరంతరాన్వేషి.!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 Aug 2020 12:48 PM GMT
నమ్యజోషి.. నిరంతరాన్వేషి.!

స్కూల్‌కు వెళ్ళాలంటేనే బోరు.. అక్కడ టీచర్లు చెప్పే పాఠాలు ఇంకా బోరు.. క్లాసు మొదలైంది మొదలు ఎప్పుడు గంట మోగుతుందా.. ఈ క్లాసు ముగుస్తుందా అని ఒకటే ఎదురు చూపులు.. మధ్య మధ్యలో టీచరు ప్రశ్నిస్తే పరాకుగా సమాధానాలు. స్కూల్‌ బ్యాగే కాదు.. ఉత్సాహం తగ్గడంతో బుర్ర కూగా బరువే అనిపించే పరిస్థితి. సాధారణంగా ఏ స్కూలు విద్యార్థికైనా ఇది మామూలే! కానీ నమ్య మాత్రం వీరికి భిన్నం. తన 13 వ ఏటే.. ఎనిమిదో క్లాసులోనే టీచర్లకే పాఠాలు చెప్పే పంతులమ్మ అయింది. పాఠశాలల్లో విద్యాబోధనలో సాంకేతిక విప్లవానికి నాంది పలికింది. ఒకసారి మనం నమ్య స్కూలు జీవితంలో తొంగి చూస్తే.. తన సాధన బలమేంటో తెలుస్తుంది.

లుధియానలో సెయింట్‌ పాల్‌ మిట్టల్‌ స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న నమ్య నిరంతరం కొత్త సాంకేతికతకు ఆకర్షితురాలయ్యేది. తన పదేళ్ళ వయసులో ఆరోక్లాసు చదువుతున్నప్పుడు, ఓ రోజు తన స్కూలు ప్రాజెక్టు కోసం ల్యాప్‌ టాప్‌ వాడుకునేందుకు అనుమతించాల్సిందిగా తల్లిని కోరింది. స్కూల్‌ ప్రాజెక్టు కాబట్టి తల్లి మౌనికా జోషి సరేనంది. అదే నమ్యజోషి జీవితంలో గొప్ప మలుపునకు కారణమైంది.ల్యాప్‌ టాప్‌లో గూగుల్‌ బ్రౌజ్‌ చే స్తుండగా మైన్‌క్రాఫ్ట్‌ కనిపించింది. అది కాస్త ఆసక్తి అనిపించి.. దీని గురించి నేను తెలుసుకోవచ్చా అని తల్లిని అడిగింది. దానికీ తల్లి పచ్చజెండా ఊపింది. ఆ రోజు స్కూల్‌ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా పోటీలో విజేతగా నిలవడంతో సంతోషించిన తల్లి ఆమెను ల్యాప్‌టాప్‌ వాడుకోడానికి స్వేచ్ఛనిచ్చింది.

B1

నమ్య మైన్‌క్రాఫ్ట్‌ గురించి చూస్తున్నప్పుడు తన స్కూల్‌ పాఠాలు దాని ద్వారా క్రాప్ట్‌ చేయవచ్చన్న ఆలోచన తట్టింది. ఆ విధానంలో సరదాగా విజువల్‌గానూ పాఠాలు వివరించే వీలుందని గ్రహించింది. స్కూల్‌లో తన స్నేహితులు పాఠాలు సరిగా వినలేక, అర్థం చేసుకోలేక ఏకాగ్రతను నిలుపుకోలేక అనాసక్తిగా ఉండటం నమ్యకు బాగా తెలుసు. ఈ పరిస్థితికి కారణం కేవలం పాఠాలు సరిగా అర్థం కాకపోవడమేనని గ్రహించింది. అయితే మైన్‌క్రాఫ్ట్‌ ద్వారా పాఠాలు తప్పకుండా ఆసక్తిగా వినవచ్చని అనుకుంది. ఆ విధానంలో సరదాగానే కాకుండా దృశ్యరూపకంగా ఉండటంతో స్నేహితుల్లో ఉత్సాహం పెరుగుతుందని భావించింది.

నమ్య మొదట ఈజిప్షియన్‌ నాగరికత పాఠాన్ని మైన్‌క్రాఫ్ట్‌ ద్వారా విజువల్‌గా రూపొందించింది. దాన్ని టీచరుకు చూపింది. విజువల్‌గా ఉండటమే కాకుండా ఆటగా కూడా కనిపించడంతో పిల్లలకు పాఠం బాగా అర్థమమయింది. దీంతో కాన్సెప్ట్‌లు త్వరగా బుర్రకెక్కడం మొదలయ్యాయి. 13 ఏళ్ళ నమ్య తన తోటి విద్యార్థులకంటే చాలా దూరంగా ఆలోచించడంతో మైన్‌క్రాఫ్ట్‌ ద్వారా పాఠాలను రూపొందించడం తెలుసుకుంది. ఈ తరహా బోధన ద్వారా విద్యను క్రీడీకరించే వీలుంది. క్రీడీకరణ వల్ల పాఠం ఆసక్తిగా మారిపోతుంది. ఎలాంటి వారికైనా పాఠాలు వినాలనిపిస్తుంది. ఇక స్కూల్‌ బెల్‌ ఎప్పుడు మోగుతుందా అని ఎదురు చూడాల్సిన అవసరమే ఉండదు.

ఉదాహరణకు లెక్కల్లో ఏరియా.. వాల్యూమ్‌ పాఠం ఉంది. దాన్ని మైన్‌క్రాఫ్ట్‌ ద్వారా చెప్పగలిగితే కాన్సెప్ట్‌ త్వరగా అర్థమవుతుంది. ఈ ప్రక్రియతో నమ్య రాత్రికి రాత్రే సెలిబ్రిటీగా మారిపోయింది. తన స్నేహితులు పొగడ్తలతో ఆకాశానికెత్తేశారు. నమ్య రెట్టించిన ఉత్సాహంతో స్కూల్‌లో దాదాపు 140 మంది విద్యార్థులకు మైన్‌క్రాఫ్ట్‌ ద్వారా పాఠాలు ఎలా నేర్చుకోవచ్చో తెలిపింది. ఈ సమయంలో కేవలం స్టూడెంట్లకే కాకుండా టీచర్లకు తెలిపితే బోధనా పద్ధతి మారిపోతుందని ఆశించింది.

ఇప్పటి దాకా టీచర్లు క్లాసులో పాఠాలు చెప్పాలంటే ఎంత కష్టపడేవారో నాకు తెలుసు. క్లాసులో చివరి విద్యార్థికి అర్థమయ్యేదాకా పాఠం రిపీట్‌ చేయాల్సి వచ్చేది. అయితే మైన్‌క్రాఫ్ట్‌ ద్వారా చెప్పగలిగితే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుంది...ఫలితంగా టీచర్లకు పదే పదే చెప్పే బాధ తప్పుతుంది’ అని అనుకుంది నమ్య. క్రీడీకరణను బోధనలో జతపరచడం ద్వారా పాఠాలు చెప్పే విధానమే మారిపోతుంది.

నమ్య తన భావాలను స్కూల్‌ టీచర్లతో పంచుకున్నాక.. స్కూల్‌ యాజమాన్యం మైన్‌క్రాఫ్‌ లైసెన్స్‌ తెచ్చుకుంది. గ్రేడ్‌ 3 నుంచి అందులో పాఠాలను చెప్పే విధానాన్ని తన కరికులమ్‌లో చేర్చింది. క్రమంగా స్కూల్‌లో బోధనా పద్దతులు కొత్త పుంతలు తొక్కుతుండటాన్ని నమ్య గమనించి సంతోషించింది. నమ్య తల్లి మౌనికా జోషి నమ్య స్కూల్‌లోనే ఐటీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌గా ఉంటోంది. తను నమ్య చే సిన ప్రయోగాన్ని కొంతమంది విద్యావేత్తలకు పంపించింది. దీంతో నమ్యకు బైట నుంచి అవకాశాలు క్యూ కట్టాయి. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా మైన్‌క్రాఫ్ట్‌ ద్వారా పాఠాలు నేర్పే విధానంలో శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ బృందంలో నమ్య పనిచేసింది.

B2

ఈ క్రమంలోనే న్యూఢిల్లీ యంగ్‌ ఇన్నోవేషన్‌ సమ్మిట్‌లో పాలుపంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈ సమ్మిట్‌లో పాల్గొన్న అత్యంత చిన్న ప్రతినిధి నమ్య మాత్రమే. ఆ సమ్మిట్‌లోనే మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ళను కలిసే అవకాశం లభించింది. ప్రేరణాత్మక వ్యక్తిత్వం కలిగిన ఐటీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యం నాదెళ్లతో వేదిక పంచుకోవడం తన జీవితంలో మరవలేని అపురూప ఘట్టమని నమ్య అంటోంది. ఆ సందర్బంగానే సత్యనాదెళ్ళ మైన్‌క్రాఫ్ట్‌కు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు నమ్య అనర్గళంగా అలవోకగా సమాధానాలిచ్చింది.

ప్రస్తుత లాక్‌డౌన్‌ నేపథ్యంలో నమ్య 500 మంది టీచర్లకు, 300 మంది విద్యార్థులకు మైన్‌క్రాఫ్ట్‌లో శిక్షణనిచ్చింది. ఏసియా బెర్లిన్‌ సమ్మిట్‌లో ప్రధాన వక్తగా ప్రసంగించాల్సిందిగా నమ్యకు ఆహ్వానం అందింది. వర్చువల్‌గా జరగబోయే ఈ సమ్మిట్‌ సెప్టెంబరులో ఉంటుంది. టెడెక్స్‌ యూత్‌ ఎస్‌.పి.ఎం.ఎస్‌.లైవ్‌లో బాలికలకు ఫన్‌ ఉండాల్సిదే అన్న అంశంపై తొలిసారిగా టెడ్‌టాక్‌ ఇచ్చింది. అంతకు ముందే ఫిన్‌లాండ్‌లో జరిగిన ఎడ్యుకేషన్‌ గ్లోబల్‌ కాన్ఫెరెన్స్‌లో పాలుపంచుకుంది.

ఐటీ ఉన్నత విద్యను అభ్యసించాలని , ఆ తర్వాత తనో సోషల్‌ ఎంట్రిప్రెన్యూర్‌గా మారాలని నమ్య కోరుకుంటోంది. తన ఆకాంక్షలు నెరవేరాలని మనమూ కోరుకుందాం!

Next Story