కలల కలనేత.. హర్షిత..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  27 Aug 2020 10:47 AM GMT
కలల కలనేత.. హర్షిత..!

మనకోసం సిద్ధంగా ఉన్న ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మార్చుకోడానికి మరింత శ్రమించడమే నా లక్ష్యం అంటోంది బెంగళూరుకు చెందిన కన్నడ యువతి హర్షిత శ్రీనివాస్‌. ఇచ్చుటలో ఉన్న హాయీ వేరెచ్చటనూ లేనేలేదని అన్నట్లు హర్షిత సమాజానికి ఎంతో కొంత ఇవ్వడం మానవీయం అంటోంది. మనకు దొరికిన సమయాల్లోనే ఎంతో కొంత సామజిక సేవ చేయడం వల్ల నష్టమేం ఉండదు కాకపోతే ఎంతో తృప్తి ఉంటుందని తను అనుభవ పూర్వకంగా చెబుతోంది. మనం దైనందిన బిజీ జీవితంలో ఈ అంశాన్నే మరచి పోతుంటాం. కానీ ఎంత బిజీగా బతుకుతున్నా.. పరుల కోసం అనే ఆలోచనకు మనసులో తావివ్వగలిగిన వారే ధన్యజీవులు. హర్షిత పిన్న వయసులోనే ఆ దిశగా అడుగులేస్తోంది.

ప్రాపంచిక మార్పు తీసుకురావడంలో మన భాగస్వామ్యం కాసింతైనా ఉండాలంటున్న హర్షిత గత అయిదేళ్లుగా యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తోంది. వృత్తిని గౌరవిస్తూనే దొరికిన ఖాళీ సమయాన్ని సామాజిక సేవలకు వినియోగించగలుగుతోంది. పేదపిల్లలు, మహిళల కోసం స్వచ్చంద సంస్థలు చేపట్టే పలు కార్యక్రమాల్లో హర్షిత పాలు పంచుకుంటోంది. ఆలాగే ప్రజల్లో పౌరస్పృహ కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది.

ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూనే మరోవైపు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్న హర్షిత నిత్యం బిజీగా ఉంటుంది. వారంత సెలవుల్ని కచ్చితంగా సామాజిక సేవకే వినియోగిస్తుంది. కొన్నిసార్లు మిగిలిన రోజుల్లోనూ కార్యక్రమాలుంటాయి. అలాంటి సమయాల్లో తన షిప్టు కన్నా ముందుగానే ఆ పనులు ముగించుకుంటుంది. ఉద్యోగం.. సామాజిక సేవ రెంటినీ బ్యాలెన్స్‌ చేయడంలో కుటుంబం సహకరిస్తోందని హర్షిత చెబుతోంది. ‘సంకల్పబలం ఉంటే వెసులుబాటు అదంతటదే ఏర్పడుతుంది. చాలా మంది రెండు పనులు ఎలా చేయగలుగుతున్నావని అడుగుతుంటారు. వారకి నేనిచ్చే సమాధానం ఒకటే...విల్‌పవర్‌ ఉండాలని. అదుంటే చాలు ఇలాంటి పనులు ఎన్నయినా సులువుగా నిర్వహించవచ్చు. అదీగాకుండా సామాజికసేవ నా పాషన్‌’ అంటోంది హర్షిత.

హర్షిత పోలీస్‌ అధికారి కావాలని కలలు కనేది. కిరణ్‌ బేడీ (తొలి మహిళ ఐపీఎస్‌ ఆఫీసర్‌) తనకు స్ఫూర్తి ప్రదాతగా భావించేది. ఏనాటికైనా ఐపీఎస్‌ కావాలని అనుకున్నా.. అన్నీ అనుకున్నట్టుగా జరగవుగా అందుకే హర్షిత మరో దిశగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. తన లక్ష్యం నెరవేరలేదని హర్షిత ఏనాడు కుంగిపోలేదు. తనకు దొరికిన అవకాశాల్లోనే సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ తృప్తి చెందుతోంది. ఇప్పటికీ కిరణ్‌ బేడీ తనకు రోల్‌ మోడలే! వృత్తి పరంగా కాకపోయినా ప్రవృత్తిపరంగా ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను అంటోంది హర్షిత.

స్కూల్‌కు వెళ్లే రోజుల్లోనే హర్షిత ఎన్‌.సి.సి.లో జాయిన్‌ అయింది. ఒకసారి ఎన్‌.సి.సి. స్టూడెంట్లను మానసిక వైకల్యమున్న చిన్నారులుండే వసతి గృహానికి వెళ్లారు. తన జీవితంలో అదే మొదటిసారి అలాంటి పిల్లల్ని చూడటం. ఒక్కసారిగా హర్షిత గుండె ద్రవించిపోయింది. విధి శాపగ్రస్తులైన ఆ పిల్లల ఆలనా పాలనా చూసుకుంటున్న సిస్టర్ల సహనం ఆమెను కట్టి పడేసింది. అంత చిన్న వయసులోనే అలాంటి పిల్లలకు సేవలందించాలన్న మంచి ఆలోచన తట్టింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అనాథ పిల్లల గృహాలు, వృద్ధాశ్రమాలను సందర్శించేది. స్కూలు నుంచి కాలేజీకి ఎదిగినా.. తన సేవాదృక్పథం బలపడిందే గానీ మారలేదు. ‘ సమాజంలో ఇలాంటి అభాగ్యులెందరో ఉంటారు. వారికి కనీస సాయం అందించడంలో ఎంతో ఆనందం లభిస్తుంది. ఇది నేను చిన్నప్పుడే తెలుసుకున్న జీవన రహస్యం’ అంటుంది హర్షిత.

తను వ్యక్తిగతంగా ఎన్ని సేవలందించినా.. సాయమందించినా అది పరిమితం. కాబట్టి ఒక స్వచ్చంద సంస్థ పెడితే బాగుంటుందనిపించి 2020 జనవరిలో పీపుల్‌ ఫర్‌ పాషన్‌ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ఖర్చులకు తొలుత తను పొదుపు చేసి కూడబెట్టిన సొమ్మునే వినియోగించింది. పేదలకు, అనాథలకు తోచిన సాయమందించడం ఈ సంస్థ ప్రధానోద్దేశం. క్రమంగా హర్షిత ప్రారంభించిన స్వచ్చంద సంస్థలో చేరడానికి పలువురు ఆసక్తి ప్రదర్శించారు. ప్రస్తుతం పది మంది సభ్యులున్నారు. దాదాపు 40 మంది వలంటీర్లున్నారు.

సంస్థ ప్రధాన ఉద్దేశం సమాజంలో సానుకూల దృక్పథాన్ని తీసుకురావడానికి కృషి చేయడం. అంతేకాదు అనాథ పిల్లలు, మహిళలు, ఫిజికలీ చాలెంజ్‌డ్‌ పిల్లలు, ఎల్‌.జి.బి.టి. కమ్యూనిటీ, పర్యావరణం, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారిని గుర్తించి వారికి చేతనైనంత సాయం చేయడం. కరోనా విజృంభిస్తున్న ఈ విపత్కర సమయంలో ఈ సంస్థ ఆకలిని తీర్చే అన్నపూర్ణగా మారింది. సంస్థలోని 10 మంది సభ్యులు కలిసి ఈ సమయంలో దాదాపు 4వేల మంది అన్నార్తులకు సరుకుల కిట్లతోపాటు ఆహారపు పొట్లాలు అందజేసింది. మూగజీవాలంటే అమితమైన ప్రేమ ఉండే హర్షిత తన సేవా సంస్థ ద్వారా ఈ కరోనా వేళ దాదాపు 500 జీవాలకు ఆహారం అందించగలిగింది.

ఈ సంస్థ కేవలం పేదలసాయానికే పరిమతం కాలేదు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది. అలాగే పేదలకు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ.. హెల్త్‌ క్యాంపులు చేపడుతోంది. పేద పిల్లలకు ఇంగ్లిష్‌ బోధన కూడా సంస్థ ద్వారా హర్షిత చేపడుతోంది. భవిష్యత్తులో మహిళలపై జరిగే అన్యాయాలు, దాడులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో హర్షితకు పలు సంస్థలు అవార్డులిచ్చి గౌరవించాయి. 2020లొ ఈస్ట్రన్‌ భూమికా ఉమెన్‌ ఐకానిక్‌ ‘జనసేవా రత్న’ అవార్డుతో సన్మానించింది. అలాగే 2019లో సోషియల్‌ ఇంపాక్ట్‌ అవార్డు లభించింది. అలాగే స్టార్‌ రొటేరియన్‌ అవార్డు వచ్చింది. ఈ అవార్డులన్నీ హర్షితలో సేవాగుణంతోపాటు బాధ్యతను పెంచుతున్నాయి.

స్వార్థమయంగా మారతున్న సమాజంలో హర్షితలాంటి వ్యక్తులే ఇంకా మానవతపై నమ్మకం ఉండేలా చేస్తున్నారు. ఇలాంటి వారిని స్పూర్తిగా తీసుకోవాలి. మరెందరో హర్షితలు ముందుకు రావాలి. అప్పుడే సమాజంలో కాసింత మార్పునైనా మనం ఆశించగలం!!

Next Story