ప్రేమ ఇంత మధురం..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  30 Aug 2020 10:43 AM GMT
ప్రేమ ఇంత మధురం..!

ప్రేమ ఎంత మధురం.. ఇది ఊహ. ప్రేమ ఇంత మధురం.. ఇది వాస్తవం! నిజానికి ప్రేమలో పడటం అంత గొప్ప విషయమేం కాదు. పడ్డాక ప్రేమతోపాటు నిలుచోడం.. భవిష్యత్తు దిశగా అడుగులేయడం చాలా గొప్ప విషయం! పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ పెళ్ళి తర్వాత ఎందుకు పలచగా మారుతుంది.. చాలా మందిలో తలెత్తే సందేహం. అయితే నిజమైన ప్రేమికుల విషయంలో అలా ఉండదు. వారు ఏ కష్టాలకు నష్టాలకు కుంగిపోరు. కలిసికట్టుగా పోరాడుతారు. తమ జీవితాన్ని ప్రేమామయంగా మార్చుకుంటారు. దీనికి ముంబై ప్రేమజంట పద్మరాసేష్‌ మోదీ, రాసేష్‌ ప్రన్లాల్‌ మోదీలే తిరుగులేని సాక్ష్యం. లైఫ్‌బియాండ్‌ ద నంబర్‌లో వీరి ప్రేమ ముచ్చట్లు చాలా హృద్యంగా వివరించారు..

‘నేను రసేష్‌ స్కూల్‌మేట్లం అంతేకాదు టీనేజ్‌ లవర్లం. మా ప్రేమను గెలిపించుకోవడం కోసం ఇద్దరం ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాం. ఏదో నెపం పెట్టుకుని రసేష్‌ ఇంటికి తరచూ వెళ్లేదాన్ని. వాళ్ళ చెల్లెళ్ళతో కబుర్లు చెప్పడానికి వెళుతున్నట్లు చెప్పినా వాస్తవం రసేష్‌ను దొంగచాటుగా చూడటానికే! నా పదిహేనవ ఏటనే తనకు ఐలవ్‌యూ అని చెప్పా. అప్పట్నుంచే ఇద్దరం ప్రేమలో పడ్డాం. అయితే ఎవరికీ ఈ విషయం తెలీదు. చివరికి పెళ్ళి విషయం వచ్చేసరికి రెండు కుటుంబాలు ససేమిరా వద్దన్నాయి.

కారణం వేర్వేరు కులాలు కావడమే. కానీ ప్రేమి‘కుల’కు వేరే కులమేం ఉంటుంది? ప్రేమ తప్ప. కానీ పెద్దలు ఈ విషయం వింటేగా. మా నాన్నను ఒప్పించేందుకు చాలా ప్రయత్నించా. కుర్రాడు బాగున్నాడు. అన్ని మంచి లక్షణాలున్నాయి. కానీ నువ్వు పెళ్ళి చేసుకోడానికి మాత్రం వీల్లేదని తేల్చేశారు. 1986 డిసెంబరులో ఇద్దరం కోర్టుకు వెళ్ళి పెళ్ళి చేసుకున్నాం. ఆ తర్వాత ముంబైకి వెళ్ళిపోయాం. మొదట్లో రెండు కుటుంబాల వారు కోపంతో ఊగిపోయారు. మమ్మల్ని పట్టించుకోలేదు. అయితే కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తుందంటారు. అది నిజమే అనిపిస్తుంది. ఆ తర్వాత వారు మాకు దగ్గరయ్యారు’ అంటూ తన ప్రేమ కహానీని గుర్తు చేసకుంది పద్మరాసేష్‌.

కోటి కలలకు పుట్టినిల్లు ముంబైలో అడుగుపెట్టాక వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా పెళ్ళయిన జంట ఉద్యోగాల్లేకుండా ముంబైలో బతకడం చాలా కష్టమని చాలా తక్కువ కాలంలోనే తెలిసింది. అతికష్టమ్మీద ఓ చిన్న గదిలాంటిది అద్దెకు దొరికింది. వంటతోపాటు అన్నీ ఆ గదిలోనే. అద్దెకు తిండికి సరిపడా డబ్బు ఉండేది.

‘రాసేష్‌కు ఉద్యోగం దొరికింది. నెలకు రూ.490 జీతం. స్నేహితులుంటున్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వంటగదిలాంటి రూమ్‌లో అద్దెకు దిగాము. మెల్లగా నేను కూడా ఉద్యోగం వెతుక్కొన్నాను. ఆర్కిటెక్ట్‌గా చేరాను. నెలకు రూ.500 వచ్చేది. ఇద్దరి ఆదాయంతో అద్దె, ఇంటి సరుకులకు ఇబ్బందిలేకుండా గడిచేది. నాకు ఇప్పటికీ బాగా గుర్తు.. మేం మొదటి సారిగా వంట పాత్రలు తెచ్చాము. అదీ మా అత్తామావయ్యలు చూడ్డానికి వస్తున్నారని తెలిసి. అప్పట్లో మా లగ్జరీ ఖర్చు ఏదైనా ఉందంటే సినిమా. ప్రతి వారం ఓ సినిమాకు తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళం. మేం ఆనందంగా గడిపే ఆ క్షణాల కోసం వారం మొత్తం ఎదురు చూసేవాళ్ళం.’ అంటూ పద్మా మోదీ తమ కుటుంబ ప్రారంభ కష్టాలను ఏకరువు పెట్టారు.

కొన్నాళ్ళకు ఇద్దరు కాస్త ముగ్గురయ్యారు. కూతురు వారి జీవితంలోకి వచ్చింది. బాధ్యతలూ పెరిగాయి. మరింత శ్రమపడేందుకే వారు సిద్ధమయ్యారు.

‘పాప పుట్టిన ఆరునెలలకే మేమున్న అపార్ట్‌మెంట్లోనే ఓ గది అమ్మకానికి వచ్చింది. స్నేహితులతో చేబదులు తెచ్చుకున్లి కొన్నాం. ఆ చిన్న గదే మా ఇల్లయింది. మా అవసరాలు, మా కలలు, మా ఆశయాలు అన్నింటినీ ఆ చిన్న గది చక్కగా ఇముడ్చుకుంది. ఆ గదే మా ప్రపంచంగా మారిపోయింది. ఆరేళ్ళ పాటు కష్టపడి పైసా పైసా కూడబెట్టి 1993లో అప్పు తీర్చాము. మానసి పుట్టాక మా బాధ్యతలూ పెరిగాయి. తనను క్రష్‌ లో వేశాం. కానీ చుట్టుపక్కల వాళ్ళు పాప పుట్టింది కదా ఇంకా పనికి వెళ్లడమేంటి? మానేయవచ్చు కదా! పాప కన్నా పెద్దదేముంటుంది? అని అనేవారు. ఎవరేమన్నా మేం పట్టించుకోదలచుకోలేదు. ఎందుకంటే మేం ఎలా వెళ్ళాలో.. ఏ మార్గాన వెళ్ళాలో.. మా అమ్మాయికి ఏ సౌకర్యాలు ఇవ్వాలో బాగా తెలుసు కాబట్టి ఆ మాటల్ని చాలా లైట్‌గా తీసుకునే వాళ్ళం. ’ అని పద్మ చెప్పుకొచ్చారు.

రసేష్‌ పద్మకు ఎప్పుడూ బాసటగా ఉండేవారు. ఆమె తన ఉద్యోగ కష్టాలు చెబుతుంటే సాంతంగా వినేవాడు కానీ ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. ఉద్యోగం కుటుంబం రెంటినీ చూసుకోవడం పద్మకు చాలా కష్టంగా ఉండేది. ఆ సమయంలో రసేష్‌ ఎంతో సహకరించేవాడు. కాయగూరలు తరగడం నుంచి బట్టలు ఇస్త్రీ చేయడం తదితర చిన్న చిన్న పనులు చేస్తుండేవాడు. పద్మను స్కూల్‌కు డ్రాప్‌ చేసేవాడు. పిల్లలకు స్కూల్‌ వేళకల్లా టిపిన్‌ బాక్స్‌లు సిద్ధం చేసేవారు. అయితే చుట్టుపక్కల వాళ్ళు ఊరుకుంటేగా.. మళ్ళీ విమర్శలు మొదలెట్టారు. అయ్యో ఇదేంటి మగాడు వంట చేయడం, కాయ గూరలు తరగడం మేం ఎక్కడయినా చూశామా అంటూ మూతి మూడు వంకర్లు తిప్పేవారు. ‘అయినా ఒకరికొకరు సహకరించుకోవడంలో తప్పేముంది అనేదే మా ఉద్దేశం. ఇప్పటికీ రసేష్‌ ఉదయం టీ తనే చేస్తాడు. నేను మూడాఫ్‌గా ఉంటే మంచి మసాల టీ తయారు చేసి ఇచ్చి నా కష్టాలు వినేవాడు.’ అంటూ నాటి మధుర స్మృతులను పద్మ నెమరు వేసుకున్నారు.

చూస్తుండగానే పాతికేళ్ళు గడచిపోయాయి. ఇద్దరికీ ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కాయి. రసేష్‌ తన కంపెనీలో వైస్‌ ప్రెసిడెంట్‌ అయ్యారు. పద్మ టెక్నికల్‌ ఆఫీసర్‌గా ఎదిగారు. జీవితంలో ఇంత దూరం నడిచాక ఇద్దరూ అనేది ఒకటే.. ప్రేమ పెద్దపెద్ద వస్తువుల్లో ఉండదు. చిన్ని చిన్ని విషయాల్లో దాగుంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి స్వాతంత్రాన్ని మరొకరు గౌరవించుకోవడంలోనే అసలైన ప్రేమ ప్రతిఫలిస్తుంటుంది అంటున్నారిద్దరు.

Next Story