శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ‘పిల్లి’ చిరుత పులి లా కనిపించి విమానాశ్రయం సిబ్బందిని ముచ్చెమటలు పట్టించింది. విమానాశ్రయ పరిసర ప్రాంతాలో చిరుతను పోలిన పిల్లి సంచ‌రించ‌డాన్ని స్థానిక ప్రజలతో పాటు పలువురు ప్రయాణీకులు కూడా చూశారు. దీనిపై వెంట‌నే ప్రయాణీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. చిరుత అనుకొని గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు. చిరుత సంచరిస్తుందేమోన‌ని సిబ్బంది విమాన ప్రయాణీకులకు గట్టి భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. క్ష‌ణం క్ష‌ణం ఉత్కంఠ‌గా మారుతుంది. చిరుత ఎవ‌రిపై దాడి చేస్తుందేమోన‌ని.. అయితే.. రెండు గంటలకు పైగా శ్రమించిన‌ ఫారెస్ట్, జూ పార్క్ సిబ్బంది అది చిరుత కాదు.. అడవి పిల్లి అని తేల్చారు. అప్ప‌టి వ‌ర‌కూ భ‌యాందోళ‌న‌లో ఉన్న ప్ర‌యాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

గ‌తంలో కూడా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు హిల్స్ కు సమీపంలో ఉండటంతో ఆయా ప్రాంతాల్లో చిరుతలు సంచ‌రించిన‌ట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. కొద్ది రోజుల క్రితం కూడా కూకట్ పల్లి.. ప్రగతినగర్ లో చిరుత కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. అంతేకాదు కూక‌ట్ ప‌ల్లి మిథిలానగర్ లో ఓ అపార్టుమెంట్ వెనుక ఉన్న గుట్ట‌ల్లో చిరుత ఉందంటూ వ‌చ్చిన వార్త‌లు క‌ల‌క‌లం సృష్టించాయి.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.