పొంచి ఉన్న మరో వైరస్ ముప్పు.. కరోనా కంటే డేంజర్..!
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 11:28 AM GMTచైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోటి మందికిపైగా ఈ మహమ్మారి భారీన పడగా.. 5లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారికి మందును కనిపెట్టలేదు. మందు కనిపెట్టడంలో శాస్త్రవేత్తలు నిమగ్నమైయ్యారు. ఇప్పటికే ఈ మహమ్మారి వ్యాప్తిని ఎలా అరికట్టాలో అని తలలు పట్టుకుంటుంటే.. మరో మహమ్మారి ముప్పు పొంచిఉందట. చైనా పరిశోధకులు మరో వైరస్‌ను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు అమెరికాకు చెందిన ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్‌లో వార పరిశీలనను ప్రచురించారు.
కొత్త వైరస్ వేగంగానే మార్పు చెందుతున్నదని, కరోనా తరహాలోనే ఆ వైరస్ కూడా మనిషి నుంచి మనిషికి సోకుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ వైరస్ నుంచి తక్షణమే సమస్య లేకున్నా.. అది కొత్త వైరస్ కావడం వల్ల ఇమ్యూనిటీ సమస్య ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు. కొత్త ఫ్లూ వైరస్‌ను G4 EA H1N1గా పిలుస్తన్నారు. 2009లో వచ్చిన స్వైన్ ఫ్లూకు దగ్గరగా ఈ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. వైరస్‌ను అడ్డుకోవాలంటే.. పందులను నియంత్రించాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. బ్రిటన్‌కు చెందిన ప్రొఫెసర్ కిన్ చౌ చాంగ్ తన సహచరులతో కలిసి ఈ కొత్త వైరస్‌పై స్టడీ చేశారు.
2011 నుంచి 2018 మధ్య చైనాలోని పది ప్రావిన్సుల్లో ఉన్న వివిధ జంతువధశాలలు, పశువైద్యశాలల్లో ఉన్న పందుల నుంచి 30వేల నమూనాలకు పైగా సేకరించారు. వాటిపై పరిశోధనలు జరుపగా దాదాపు 179 రకాల స్వైన్ ప్లూ వైరస్‌లను కనుగొన్నారు. వీటితో ఫెర్రెట్ అనే ముంగిస జాతికి చెందిన జంతువులపై ప్రయోగాలు చేశారు. కొత్తగా కనుగొన్న వైరస్‌లన్నింటిలోకెల్లా జీ-4 వైరస్ ఫెర్రెట్‌లో ప్రమాదకర లక్షణాలు చూపినట్లు పరిశోధకులు గుర్తించారు.. అలాగే మానవ కణాల్లోనే ఇది వేగంగా వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు గుర్తించారు.