ఆచార్య ఫస్ట్ లుక్ కు ముహూర్తం కుదిరినట్లే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Aug 2020 12:09 PM GMT
ఆచార్య ఫస్ట్ లుక్ కు ముహూర్తం కుదిరినట్లే..!

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఆరోజు ఆయన అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఉండనుంది. ఈ విషయాన్ని ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు. చిరు 152 వ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఆగష్టు 22, సాయంత్రం 4 గంటలకు రాబోతోందని రామ్ చరణ్ స్పష్టం చేశారు.

చిరంజీవి 152వ చిత్రం పేరు 'ఆచార్య' అంటూ ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు. తనకున్న మాస్ ఫాలోయింగ్ ను అలరించేలా ఫస్ట్ లుక్ తో పాటూ మోషన్ పోస్టర్ ను ఆగష్టు 22 సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నారు.కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాల ద్వారా కొరటాల సామాజిక అంశాలను తన సినిమాల్లో మేళవించారు. ఈ సినిమాలో కూడా అదే తరహాలో సోషియో-పొలిటికల్ ఎలిమెంట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. త్రిష అనూహ్యంగా సినిమా నుండి తప్పుకోవడంతో కాజల్ అనూహ్యంగా ప్రాజెక్టు లోకి వచ్చింది.

ఈ సినిమాలో మాజీ నక్సలైట్ గా, లెక్చరర్ గా చిరంజీవి నటిస్తున్నారంటూ గతంలో కథనాలు వినిపించాయి. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా.. రెజీనా కసాండ్రా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఆమె సాంగ్ షూటింగ్ ను లాక్ డౌన్ కంటే ముందే పూర్తీ చేశారు. మిగిలిన భాగం షూటింగ్ సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తీ చేయనున్నారు.

ఇక ఈ మధ్య కాలంలో చిరంజీవి ఓ రీమేక్ లో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అజిత్ హీరోగా నటించిన 'వేదాళం' సినిమా రీమేక్ లో మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ చిరంజీవి పుట్టినరోజు నాడు వస్తుందేమో చూడాలి.

షాడో సినిమా తర్వాత మెహర్ రమేష్ మెగా ఫోన్ పట్టి చాలా రోజులే అవుతోంది. ఒరిజినల్ వేదాళంకు.. తెలుగు వెర్షన్ స్క్రిప్ట్ కు చాలానే మార్పులు చేసినట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ మార్పులు మెగా స్టార్ కు నచ్చినట్లు కూడా చెబుతున్నారు.

మలయాళం సినిమా 'లూసిఫర్' ను సాహో దర్శకుడు సుజిత్ తెలుగులో రీమేక్ చేస్తున్నారని.. అందులో మెగాస్టార్ చిరంజీవి మెయిన్ లీడ్ లో నటిస్తూ ఉన్నారంటూ గతంలో కథనాలు వచ్చాయి. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా రావాల్సి ఉంది.

Next Story