తెలుగు సినిమా ‘ఓటీటీ’ సత్తా ఇప్పుడు తెలుస్తుంది
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 18 Aug 2020 8:12 AM GMTవివిధ భాషల్లో భారీ చిత్రాలు నేరుగా ఓటీటీల్లో రిలీజయ్యాయి. కానీ తెలుగు సినిమా మాత్రం ఈ విషయంలో వెనుకంజలోనే ఉంది. గత కొన్ని నెలల్లో విడుదలైన అన్ని తెలుగు చిత్రాలూ చిన్న స్థాయివే. అన్నింట్లోకి కొంచెం పేరున్న సినిమాలంటే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘ఉమామహేశ్వరరావు ఉగ్రరూపస్య’ మాత్రమే. వాటిని నిర్మించింది పెద్ద నిర్మాణ సంస్థలే కానీ.. బడ్జెట్, కాస్టింగ్ పరంగా అవి చిన్నవే.
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కోట్లు పెట్టి సినిమాలు కొని రిలీజ్ చేసేది ఇప్పటికే ఉన్న తమ సబ్‌స్క్రైబర్లను ఎంగేజ్ చేయడం కోసమే కాదు.. కొత్త సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడానికి. ప్రతి కొత్త చిత్రం విడుదలైనపుడు కొత్తగా ఎన్ని సబ్‌స్క్రిప్షన్లు వచ్చాయన్నది చూసుకుంటాయి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్. దాన్ని బట్టి ఎంత పెట్టుబడి పెడుతున్నాం.. ఎంత ప్రయోజనం దక్కుతోంది అన్నది చూసుకుంటాయి.
బాలీవుడ్ సినిమాల రీచ్ ఎక్కువ. వాటికి పదుల కోట్లలో పెట్టుబడి పెట్టి.. ఆ మేరకు ప్రయోజనం పొందుతాయి ఓటీటీలు. అందుకే దూకుడుగా పెద్ద సినిమాలతో భారీ డీల్స్ చేసుకున్నాయి. ప్రాంతీయ సినిమాల విషయంలో ఇలాంటి దూకుడు కనిపించలేదు. మన నిర్మాతలూ ఓటీటీ రిలీజ్ విషయంలో తటపటాయించగా.. ఓటీటీలు కూడా ఎక్కువ పెట్టుబడి పెట్టే విషయంలో ముందు వెనుక ఆలోచించాయి.
ఐతే ఈ మధ్య ఈ ప్రతిష్ఠంభన వీడి.. క్రేజీ సినిమాలతో డీల్ కుదిరింది. వాటన్నింట్లోకి ఎక్కువ ఆసక్తి రేపుతున్నది ‘వి’ మూవీనే. ఈ చిత్రాన్ని ప్రైమ్ వాళ్లు రూ.32 కోట్లకు కొన్నట్లు చెబుతున్నారు. సెప్టెంబరు తొలి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేస్తారంటున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ప్రైమ్ రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారందరూ.
కచ్చితంగా దీనికి తెలుగు సినిమాల వరకు రికార్డు స్థాయిలో వ్యూయర్ షిప్ వస్తుందని.. కొత్త సబ్‌స్క్రిప్షన్లు కూడా భారీగా ఉంటాయని.. అప్పుడు కానీ తెలుగు సినిమా సత్తా ఏంటో ఓటీటీలకు తెలిసి రాదని.. ‘వి’ డిజిటల్ మీడియంలో సూపర్ హిట్ అయితే మరిన్ని సినిమాలకు మంచి డీల్స్ కుదురుతాయని అంచనా వేస్తున్నారు.