బిస్కెట్ల లారీ దగ్ధం.. రూ.26 లక్షలు అగ్నికి ఆహుతి
By తోట వంశీ కుమార్ Published on 30 April 2020 1:24 PM ISTఅనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై అగ్ని ప్రమాదం జరిగింది. బిస్కెట్ లోడ్‌తో వెలుతున్న లారీకి మంటలంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.26 లక్షలు విలువ చేసే బిస్కెట్లు కాలి బూడిదైయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ కంటైనర్ లారీలో హైడెన్‌సీక్, పార్లే బిస్కెట్ల ను తరలిస్తున్నారు. పెనుగొండ సమీపంలోకి రాగానే.. లారీ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అది గమనించిన లారీ డ్రైవర్ వెంకటాచలం లారీని రోడ్డు పక్కకు ఆపాడు. వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే.. లారీని నిలిపి వేసిన కాసేపటికే మంటలు పెద్ద ఎత్తున చెలరేగి కంటైనర్ దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.26లక్షలు విలువ చేసే బిస్కెట్లు అగ్నికి ఆహుతైయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్రామస్థుల సహకారంతో కొన్ని బిస్కెట్ల ప్యాకెట్లను బయటికి తీశారు.