మంటల్లో స్కూల్ బస్సు.. విద్యార్థులంతా..
By సుభాష్ Published on 8 Feb 2020 8:45 AM GMTనారాయణపేట జిల్లా నర్వ మండలంలో బస్సులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కుమార్ లింగంపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్థులు ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. విద్యార్థులు ఓ వ్యాన్‌లో ఆత్మకూర్ పాఠశాలకు వెళ్తుండగా, మార్గమధ్యంలో ప్రమాదవశాత్తు వాహనంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ఏడుగురు విద్యార్థులు, మరో ముగ్గురు సాధారణ ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. వ్యాన్‌లో మంటలు గమనించిన డ్రైవర్ విద్యార్థులను, ప్రయాణికులను కాపాడి బస్సు నుంచి దింపేశాడు. వ్యాన్ విద్యార్థులను ఎక్కించుకుని వెళ్తున్న కొద్దిసేపటికి ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ప్రమాదంలో వ్యాన్ పూర్తిగా దగ్ధమైంది. ఘటన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఉన్నవారంతా క్షేమంగా ఉండటంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్ డ్రైవర్, యజమానిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.