అర్ధరాత్రి వేళ ఆ అవసరం ఏముంది.. శ్రీశైలం ఘటనలో కొత్త కోణం
By సుభాష్ Published on 25 Aug 2020 12:31 PM GMTశ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రమాదంపై తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో కొత్త బ్యాటరీలు అమర్చుతున్న తరుణంలో అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి సమయంలో బ్యాటరీలు మార్చాల్సిన అవసరం ఏముందనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాటరీలు మార్చే సమయంలో జరిగిన పొరపాటే 9 మంది ప్రాణాలకు కారణమైందనే ప్రశ్నలు ఇప్పుడు జన్‌కోలో పని చేసే ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.
సీఐడీ విచారణ ముమ్మరం
ఈ ప్రమాదం ఘటనపై సీఐఈ విచారణ ముమ్మరం చేసింది. దర్యాప్తునకు కావాల్సిన పూర్తి ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమా..? లేక మానవ తప్పిదం ఉందా.. ? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇదంతా సాంకేతికమైన అంశం కావడంతో ముఖ్యంగా యూనిట్ల పనితీరు, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు సీఐడీ అధికారులు.
మావన తప్పిదాలే కారణం..
ప్రమాదం జరగడానికి మానవ దప్పిదాలే కారణమని ప్రచారం జోరుగా జరుగుతోంది. 220కేవీకి డీసీ కరెంటు సరఫరా చేసే బ్యాటరీలు బిగించే సమయంలో బోర్డులో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించినట్లు జన్‌కో ఉద్యోగులు భావిస్తున్నారు. జనరేటర్‌ను నియంత్రించే సెన్సార్‌కు నేరుగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో లోడ్ ఎక్కువై మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.
అర్ధరాత్రి బ్యాటరీలు మార్చడం వెనుక అనుమానాలు
అలాగే అగ్నిప్రమాదం జరిగిన రోజు హైదరాబాద్ జలసౌదాలోని సీఈ స్థాయిలో ఉన్నఅధికారి వచ్చి బ్యాటరీలు మార్పించే పనులను హడావిడిగా చేశారని కూడా పుకార్లు షికార్లు అవుతున్నాయి. ఇక్కడ సీఈ ఉన్నా.. ఆయన ప్రమేయం లేకుండా సదరు అధికారే నలుగురిని తీసుకువచ్చి బ్యాటరీలను మార్పించే పనులను చేపట్టినట్లు సమాచారం. అక్కడ పని చేస్తున్న డీఈ, ఏఈ పనులపై అభ్యంతరం వ్యక్తం చేసినా.. ఆవేమి పట్టించుకోకుండా తాను చెప్పిందే చేయాలని హుకుం జారీ చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇలా ఆర్ధరాత్రి సమయంలో ఇంత హడావిడిగా బ్యాటరీలు మార్చడం వెనుక కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విద్యుత్ కేంద్రం మళ్లీ పూర్వ వైభవానికి రావాలంటే వేల కోట్లకుపైగా ఖర్చు
ఈ ఘటనపై అనుమానాలు, వాదనలు, విమర్శలు, నిర్లక్ష్యం లాంటి వాదనలు ఎలా ఉన్నా.. ప్రభుత్వం మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుతం జల విద్యుత్ కేంద్రం మళ్లీ పూర్వ వైభవానికి రావాలంటే వేల కోట్లకుపైగా ఖర్చు చేయక తప్పని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రమాదానికి గురైన యూనిట్లలో కొన్ని పరికరాలు ఆర్డర్ చేసి జపాన్ నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుందని, అందుకే పునరుద్దరణకు కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఘటనపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. విచారణ పూర్తయితే అసలైన తప్పిదాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.