ఫీవర్ ఆస్పత్రి డీఎంవోని నిర్భంధించిన ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం
By తోట వంశీ కుమార్ Published on 5 July 2020 4:22 PM ISTకరోనా మహమ్మారి పేరు చెప్పి ప్రైవేట్ ఆస్పత్రులు నిలువులా దోచుకుంటున్న వైనం మరోసారి బయటపడింది. సాధారణ ప్రజలతో పాటు కరోనా వారియర్స్‌కు ప్రైవేట్ ఆస్పత్రులు అధిక బిల్లులతో చుక్కలు చూపెడుతున్నారు. కరోనా చికిత్సకు అధిక బిల్లు ఎందుకు వేశారంటూ నిలదీసిన ఫీవర్ ఆస్పత్రి డిఎంవోను ఓ ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం నిర్భందించింది. ఫీవర్ ఆస్పత్రి డీఎంవో డాక్టర్ సుల్తానాను తుంబే ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు. కరోనా లక్షణాలతో తుంబే ఆస్పత్రిలో చేరిన తనకు 24 గంటల్లో లక్షా 15 వేల బిల్లు వేశారని ఆమె సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులపై ప్రశ్నించినందుకు సరైన వైద్య సేవలందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. తనతోపాటు తన కుటుంబ సభ్యులు కరోనా బారినపడ్డారన్నారు.
ఘటనపై ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందిస్తూ... సుల్తానా తమ ఆస్పత్రిలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం పరీక్షలో సుల్తానాకు కొవిడ్ పాజిటివ్‌గా తేలిందన్నారు. కాగా ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పకుండానే ఆమె ప్రైవేటు ఆస్పత్రిలో చేరారన్నారు. సమాచారం ఇస్తే మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకునే వాళ్లమని ఆయన పేర్కొన్నారు.