కరోనా మందు ధర తగ్గించిన గ్లెన్‌మార్క్
By Medi Samrat Published on 13 July 2020 4:22 PM ISTకరోనా వైరస్ భారత్‌లో విజృంభిస్తున్న తరుణంలో ప్రముఖ డ్రగ్ తయారీ సంస్థ గ్లెన్‌మార్క్ కాస్త ఊరట నిచ్చే విషయాన్ని తెలిపింది. గ్లెన్‌మార్క్ తయారుచేస్తున్న యాంటీవైరల్ డ్రగ్ ఫావిపిరవిర్(ఫాబీ ప్లూ) ధరను 27శాతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. టాబ్లెట్ ధరను తగ్గించి 75 రూపాయలకు అందిస్తున్నట్టు గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ సోమవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
గత నెలలో టాబ్లెట్‌కు 103 రూపాయల చొప్పున విడుదల చేసిన సంగతి తెలిసిందే. కొత్త గరిష్ట రిటైల్ ధర ప్రతి మాత్రకు 75 రూపాయలుగా ఉంటుందని తెలిపింది. ఇతర దేశాలలో ఫావిపిరవిర్ ఖర్చుతో పోల్చితే భారతదేశంలో ఫాబిఫ్లూను అతి తక్కువ మార్కెట్ ఖర్చుతో ప్రారంభించామని, ఇపుడు ఇండియాలో తయారు కావడం, అధిక ఉత్పత్తి కారణంగా తక్కువ ధరతో అందుబాటులోకి తెచ్చామని సంస్థ ఇండియా బిజినెస్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అలోక్ మాలిక్ వెల్లడించారు.
దీనిద్వారా కరోనా రోగులకు తమ ఔషధం మరింత చేరువవుతుందని తాము ఆశిస్తున్నామన్నారు. అలాగే ఇండియాలో కోవిడ్-19 రోగుల్లో కాంబినేషన్ థెరపీగా రెండు యాంటీవైరల్స్ డ్రగ్స్ షావిపిరవిర్, ఉమిఫెనోవిర్ సామర్థ్యాన్ని అంచనా వేసే మరో దశ 3 క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తున్నట్టు అలోక్ మాలిక్ తెలిపారు.
ఇదిలావుంటే.. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 28,701 మంది కరోనా బారిన పడ్డారు. 18,850 మంది కోలుకోగా, 500 మంది కరోనాతో పోరాడి మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,78,254కి చేరింది. మరణాల సంఖ్య 23,174కి చేరింది. ప్రస్తుతం 3,01,609 యాక్టివ్ కేసులు ఉండగా.. 5,53,470 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.