తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనాతో చనిపోయారంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు.. ఇక అతడిపై..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jun 2020 8:48 PM ISTసోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి కదా అంటూ ఎలా పడితే అలా పోస్టులు.. ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో ఇప్పటికే వందల కొద్దీ ఫేక్ న్యూస్ వైరల్ అవుతూ ఉన్నాయి. కొందరు కావాలనే ఇలాంటి పోస్టులు పెడుతూ ఉంటారు. అలాంటి వారిపై కేసులు పెట్టి జైల్లో వేయిస్తే తప్పితే బుద్ధి రాదు.
హైదరాబాద్ బోయినపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తలు ఓ ఫేస్ బుక్ యూజర్ పై స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పణ్యాల రాజు అనే వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ కారణంగా చనిపోయారంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. కరోనా వైరస్ సోకి కేసీఆర్ మరణించారని.. ముక్కు ద్వారా కరోనా వైరస్ లోపలికి వెళ్లిందని.. ఆయన చనిపోయారంటూ గాంధీ ఆసుపత్రి వైద్యులు ధృవీకరించారంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని.. ప్రజల సెంటిమెంట్లతో కూడా ఆడుకుంటున్నారంటూ బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు కేసు రిజిస్టర్ చేశారు.
ఈ పోస్టు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయింది. కొందరు ఇది తప్పుడు వార్త అని గమనించగా.. ఫోటోషాప్ చేసిన ఫోటోను చూసి నిజంగానే కేసీఆర్ చనిపోయారేమోనని నమ్మారు. వెంటనే కొందరు టీఆర్ఎస్ పార్టీ సభ్యులు విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వచ్చారు. పణ్యాల రాజు అనే వ్యక్తి ఫేస్ బుక్ ఐడీపై పోలీసులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఐపీ అడ్రెస్ ద్వారా సదరు వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. సోమవారం నాడు సాయంత్రం ప్రగతి భవన్ లో రివ్యూ మీటింగ్ ను పెట్టారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఎప్పటికప్పుడు మీటింగ్ లు నిర్వహిస్తూ ఉన్నారు. కంటోన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టమని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.