మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి.. చనిపోయారంటూ పోస్టు పెట్టిన రచయిత్రి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Jun 2020 1:43 PM GMT
మెగాస్టార్ చిరంజీవి ఫోటో పెట్టి.. చనిపోయారంటూ పోస్టు పెట్టిన రచయిత్రి

ఎంతో భవిష్యత్తు ఉన్న కన్నడ నటుడు చిరంజీవి సర్జా చనిపోవడం పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. చిరంజీవి సర్జా సీనియర్ నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జాకి మేనల్లుడు. 39 సంవత్సరాల చిరంజీవి సర్జా రెండేళ్ల క్రితం హీరోయిన్ మేఘన రాజ్‌ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె తెలుగులో బెండు అప్పారావు ఆర్.ఎం.పి. అనే సినిమాలో నటించింది.

మేఘన రాజ్ నాలుగు నెలల గర్భవతి. ఆయన ఛాతీ నొప్పి అనగానే ఆదివారం మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో జయంత్ నగర్‌లోని సాగర్ అపోలో హాస్పిటల్ కి తరలించారు. అక్కడ ఆయన్ను బ్రతికించడానికి డాక్టర్స్ గంటన్నర పాటు శ్రమించారు. కానీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. మూడు గంటల 48 నిమిషాలకు చిరంజీవి సర్జా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 22 సినిమాల్లో నటించిన చిరంజీవి సర్జా అయిదు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. చిరంజీవి సర్జా మృతిపై పలువురు ప్రముఖులు స్పందించారు.ప్రముఖ రచయిత్రి అయిన శోభా డే చిరంజీవి సర్జా మృతిపై స్పందిస్తూ ఓ ట్వీట్ పెట్టింది. మరో ధ్రువతార నేలకొరిగారు. పూడ్చుకోలేని లోటు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను' అంటూ ఆమె చిరంజీవి సర్జాను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. కానీ ఆమె పెట్టిన ఫోటో తీవ్ర విమర్శలకు దారి తీసింది.

ఎందుకంటే ఆమె పెట్టిన ఫోటో మెగా స్టార్ చిరంజీవి ఫోటో..! మేడమ్ చనిపోయింది ఆయన కాదు.. చూసుకోవాలి కదా అంటూ పలువురు కామెంట్లు చేశారు. కొద్దిసేపటికి చేసిన తప్పును గమనించిన శోభా డే.. వెంటనే ఆ ట్వీట్ ను తన అకౌంట్ నుండి తీసేసింది. ఇంతలో పలువురు ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Next Story