పబ్జీలో ప్రేమించుకుని.. పాకిస్థాన్ నుండి భారత్ లోకి వచ్చింది సీమా హైదర్ అనే వివాహిత. ప్రస్తుతం అధికారులు ఆమెను విచారిస్తూ ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన గూఢచారి కూడా అయ్యిండొచ్చు అనే ప్రచారం సాగుతూ ఉంది.
ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న మహిళకు సంబంధించిన రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఓ ఫోటోలో సీమా హైదర్ ఉండగా.. మరో ఫోటోలో యూనిఫామ్ ధరించిన మహిళ ఫోటో ఉంది.
2019లో ఆన్‌లైన్ గేమ్ PUBGలో పరిచయమైన భారతీయుడి కోసం పాకిస్తాన్ నుండి దుబాయ్‌కి.. అక్కడి నుండి నేపాల్‌కు.. ఆ తర్వాత అక్రమంగా భారతదేశంలోకి చొరబడిన సీమా గురించి దేశంలో హాట్ టాపిక్ అయింది. ఆమె పాకిస్థాన్ గూఢచారి అనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది.
ఆర్మీ యూనిఫాంలో ఉన్న మహిళ ‘సయేమా రెహమాన్’ అని.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రమోట్ చేసి సీమా హైదర్‌గా భారత్‌కు వచ్చిందని ఫోటోను షేర్ చేస్తున్న యూజర్లు చెబుతున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఫోటోకు సీమా హైదర్ కు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది.
మేము ఆర్మీ యూనిఫాంలో ఉన్న మహిళకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ లో మాకు "తమిళనాడు పోలీస్‌లో మహిళలు 50 సంవత్సరాలు విధులు పూర్తి చేసారు" అనే శీర్షికతో ఒక కథనాన్ని కనుగొన్నాం. వైరల్ ఫోటో లోని మహిళ తమిళనాడులో మొదటి మహిళా ఎస్‌ఐ ఉషా రాణి నరేంద్రగా గుర్తించాం. తమిళనాడులో 2021లో పోలీస్ మ్యూజియం ప్రారంభమైనప్పుడు ఉషారాణి నరేంద్ర ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారని కూడా కథనం పేర్కొంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదికలో ఉషా రాణి నరేంద్ర చిత్రాన్ని ఉపయోగించింది. “First woman sub-inspector shares space with Tamil Nadu CM at police museum inaugural” అనే టైటిల్ తో సెప్టెంబర్ 29, 2021న కథనాన్ని ప్రసారం చేసింది.
ఈ నివేదిక ప్రకారం, ఉషా రాణి దేశంలోని మొదటి మహిళా సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీసుల 21 మంది బ్యాచ్ లో ఒకరు. ఆమె 1973లో నేరుగా ఎస్‌ఐగా నియమితులయ్యారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు.
Hindu Tamil మీడియా సంస్థ కూడా ఉషా రాణి ఫోటోను ఉపయోగించి కథనాన్ని ప్రసారం చేసింది.
వైరల్ ఇమేజ్‌లో ఉన్నది సీమా హైదర్ కాదని మేము నిర్ధారించాము. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Credits : Md Mahfooz Alam