పాఠశాలకు ఆలస్యంగా వస్తున్న టీచర్ల శాలరీల్లో తమిళనాడు ప్రభుత్వం కోత విధించబోతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఆగస్ట్ 1వ తారీఖు నుండి తమిళనాడు అంతటా అమలు చేయబోతున్నారంటూ కథనాలను ప్రసారం చేస్తున్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'
తమిళ సమయం అనే వెబ్‌సైట్.. వైరల్ పోస్ట్ గురించి తమిళనాడు పాఠశాల విద్యా శాఖను సంప్రదించింది. ఉపాధ్యాయుల హాజరును స్మార్ట్ అప్లికేషన్ల ద్వారా నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతోందని.. అయితే ఆగస్టు 1 నుంచి యాప్ ద్వారా ఉదయం 10 గంటలలోపు ఉపాధ్యాయులు హాజరు నమోదు చేసుకోకుంటే వేతనంలో కోత విధిస్తామంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని.. అలాంటిది ప్రకటించలేదని ఆ శాఖ పేర్కొంది."
పాఠశాలల్లో జరిగే అన్ని సంఘటనలకు ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కళ్లకురిచ్చి ఘటనపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ.. 77 మార్గదర్శకాలతో కూడిన కొత్త సర్క్యులర్‌ను అన్ని పాఠశాలలకు పంపింది. ప్రస్తుతం ఆగస్టు 1 నుంచి ఉపాధ్యాయుల హాజరును యాప్ ద్వారా నమోదు చేసేందుకు విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
జూలై 18న తమిళనాడులోని కళ్లకురిచ్చిలో 12వ తరగతి విద్యార్థి మరణించిన తర్వాత ఈ వైరల్ పోస్ట్ వచ్చింది. కళ్లకురిచ్చి ఘటన తర్వాత పలు నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా తయారయ్యాయి. విద్యార్థులు, బాలిక కుటుంబ సభ్యులతో సహా వందలాది మంది స్కూల్ ను ధ్వంసం చేసి పోలీసులతో ఘర్షణకు దిగారు.
DT NEXT ద్వారా 1 జూలై 2018న ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. "ప్రభుత్వం యాప్ ద్వారా అటెండెన్స్ తీసుకోవాలని భావిస్తోందని.. అలా చేయడం వలన ఉపాధ్యాయులు తప్పనిసరిగా స్కూల్స్ కు హాజరవుతారు" అనే కథనం ఉంది. ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మొత్తం 100% హాజరు ఉండేలా పాఠశాల విభాగం హాజరు విధానాన్ని తీసుకుని వచ్చిందని అందులో ఉంది.
TN DIPR ఫ్యాక్ట్ చెక్ విభాగం కూడా ఈ వైరల్ కథనం ఫేక్ అని కొట్టివేసింది.
కాబట్టి, వైరల్ అవుతున్న కథనంలో ఎలాంటి నిజం లేదు.