GMT News and TV Networks కు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అందులో తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 7వ తేదీ వరకూ పొడిగించినట్లుగా ఉంది.
మరో వాట్సాప్ మెసేజీలో జూన్ 1 నుండి 4 వరకూ తెలంగాణలో లాక్ డౌన్ సమయంలో మార్పులు తీసుకుని వస్తున్నారని తెలిపారు. ఆ రోజుల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ లాక్ డౌన్ లో సడలింపులు చేశారని.. జూన్ 5 నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ సడలింపులు ఉంటాయని మెసేజీని వైరల్ చేస్తూ ఉన్నారు.
నిజ నిర్ధారణ:
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగిస్తారని అందరూ భావిస్తూ ఉన్నారు. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. కొన్ని మీడియా సంస్థలు లాక్ డౌన్ ను జూన్ 7 వరకూ పొడిగించే అవకాశాలు ఉన్నాయని కథనాలను ప్రచారం చేయగా.. మరి కొన్ని మీడియా సంస్థలు జూన్ 10 వరకూ పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తన తర్వాతి కేబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ పై ఓ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ మీటింగ్ మే 30న జరగనుంది. ఆ మీటింగ్ లో రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించడమే కాకుండా లాక్ డౌన్ కొనసాగించాలా లేదా అనే విషయమై నిర్ణయం తీసుకోవచ్చు.
https://www.thehansindia.com/telangana/telangana-extension-of-lockdown-till-june-10-687576
https://www.deccanchronicle.com/nation/current-affairs/250521/lockdown-likely-to-be-extended-till-june-7.html
"ఈ నెల 30 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్రంలో వ్యవసాయం, కొనసాగుతున్న ధాన్యం సేకరణ, విత్తనాలు, ఎరువుల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధానికి చర్యలు, కరోనా, లాక్ డౌన్ తదితర అంశాల మీద క్యాబినెట్ చర్చించనున్నది." అంటూ తెలంగాణ సిఎంఓ నుండి ట్వీట్ వచ్చింది.
GMT News and TV Networks మీడియా సంస్థ వైరల్ అవుతున్న ఫోటోపై వివరణ ఇచ్చింది. తాము అలాంటి వార్తను అసలు ప్రచురించలేదని.. దాన్ని ఎవరో ఎడిట్ చేశారని వివరించింది. అదొక తప్పుడు సమాచారమని.. ఎవరితోనూ షేర్ చేయద్దని తేల్చి చెప్పింది.
కాబట్టి.. తెలంగాణ లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగింపుపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. వైరల్ అవుతున్న ఈ పోస్టులు 'పచ్చి అబద్ధం'.