ముస్లిం విద్యార్థులు బురఖా ధరించి TSPSC పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారని, హిందూ విద్యార్థులు వారి మంగళసూత్రాలు, ఇతర నగలను తీసివేయమని కోరుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది.
వీడియోలో, బురఖా ధరించిన మహిళ పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడాన్ని చూడవచ్చు, మరికొందరు మహిళలు తమ నగలను తీసివేయడం చూడవచ్చు.
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) లో మొత్తం 503 పోస్టులకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను 16 అక్టోబర్ 2022న నిర్వహించిన తర్వాత ఈ వీడియో వచ్చింది. ఫేస్‌బుక్ వినియోగదారు వీడియోను షేర్ చేస్తూ, "తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలో హిందూ మహిళలు గాజులు, ఉంగరాలు, మంగళసూత్రం తీసేస్తూ ఉన్నారు.. ముస్లిం మహిళలు మాత్రం బురఖాతో ఎలా వెళ్తున్నారో చూడండి" అని రాశారు.
నిజ నిర్ధారణ:
NewMeter వీడియోను జాగ్రత్తగా గమనించి ఆదిలాబాద్ 'విద్యార్థి జూనియర్ కళాశాల' బోర్డును గమనించింది. మేము కళాశాల చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ రెడ్డిని సంప్రదించాము.. ముస్లిం విద్యార్థులు ముఖానికి ముసుగు లేకుండా బురఖా ధరించి TSPSC 2022 పరీక్షకు అనుమతించారని.. విద్యార్థులందరూ వారి నగలను తీసివేయమని అడిగారని ధృవీకరించారు. హిందూ విద్యార్థులు తమ మంగళసూత్రాలను తొలగించాలా అని అడిగినప్పుడు, ఈ విషయాన్ని ఆదిలాబాద్ పోలీసులతో మాట్లాడాలని ఆయన కోరారు.
మేము ఆదిలాబాద్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాము.. వైరల్ వీడియోపై తాము అవగాహన కల్పిస్తామని ఇన్‌చార్జ్ అధికారి చెప్పారు, అయితే మంగళసూత్రాల తొలగింపు గురించి వివరణ ఇవ్వడానికి నిరాకరించారు.
ABN LIVE TV, సాక్షి ఎడ్యుకేషన్ మీడియా సంస్థల ప్రకారం, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టిక్కెట్‌తో పాటు ID ప్రూఫ్‌ను మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించారు. వివాహిత స్త్రీలకు వారి మంగళసూత్రాలను ధరించడానికి మినహాయింపు ఇచ్చారు. బూట్లు ధరించడం, మెహందీ, చేతులు, కాళ్ళపై పచ్చబొట్లు కూడా నిషేధించబడ్డాయి. పరీక్ష హాలులో మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్, వాచ్ కాలిక్యులేటర్లు, పర్సులు, నోట్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను నిషేధించారు.
ఈ విషయంపై న్యూస్ మీటర్ చేసిన విచారణలో.. వివాహిత మహిళలు తమ మంగళసూత్రాన్ని తీసివేయమని అడిగారో లేదో న్యూస్‌మీటర్ స్వతంత్రంగా ధృవీకరించలేకపోయింది. అయితే అక్టోబర్ 16న ఆదిలాబాద్‌లోని విద్యార్థి జూనియర్ కాలేజీలో నిర్వహించిన TSPSC గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల వీడియో మాత్రం నిజమేనని మేము ధృవీకరించాము.