ఇటీవల బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ ను సీత పాత్ర కోసం తీసుకున్నారు అనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 'Sita - The Incarnation' అనే సినిమాలో ముఖ్య పాత్రను కరీనా కపూర్ పోషిస్తోందనే వార్తలు ప్రచారం చేశారు. అలౌకిక్ దేశాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారని.. ఆమెను ఈ పాత్ర కోసం తీసుకున్నారని చెప్పుకొచ్చారు.
దీంతో పెద్ద ఎత్తున కరీనా కపూర్ ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి.
వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం, కరీనా కపూర్ ఈ పాత్ర పోషించడానికి 12 కోట్లు తీసుకుంటోందట. అప్పటి నుండి ప్రజలు తమ కోపాన్ని సోషల్ మీడియాలో చూపించారు #BoycottKareenaKapoorKhan అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేశారు. పలు మీమ్స్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న ఈ పోస్టులో 'ఎటువంటి నిజం లేదు'.
వైరల్ అవుతున్న పోస్టు గురించి న్యూస్ మీటర్ సెర్చ్ చేయగా.. పలు మీడియా సంస్థలు కరీనా కపూర్ ఈ సినిమాలో నటిస్తోందని.. ఆమె ఏకంగా 12 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ గా తీసుకుంటూ ఉందనే కథనాలు వచ్చాయి.
అయితే ఈ సినిమాకు చెందిన రైటర్ కె.విజయేంద్ర ప్రసాద్ ఈ వార్తలపై స్పందించారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చి చెప్పారు.
ఈ చిత్రానికి పని చేస్తున్న వారు కూడా ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని.. కేవలం గాలి వార్తలు అంటూ కొట్టి పడేశారు. కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ ఓ సినిమాలో రావణుడి పాత్ర పోషిస్తూ ఉన్నాడని.. అంతమాత్రాన మరో సినిమాలో కరీనా కపూర్ ను సీతగా ఊహించేసుకుని వార్తలు రాశారని వెల్లడించారు. ఇవి కేవలం ఊహించుకుని రాసిన వార్తలు తప్పితే ఎటువంటి నిజం లేదని తేల్చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 12 కోట్ల రూపాయలు కరీనా కపూర్ కు రెమ్యునరేషన్ గా ఇవ్వడం కూడా కుదరని పని అని పలువురు చెప్పుకొచ్చారు.
దర్శకుడు అలౌకిక్ దేశాయ్, చిత్ర యూనిట్ కూడా ఈ వార్తలను ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ సినిమా ఇంకా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ లోనే ఉందని తెలిపారు. అంతే తప్పితే తాము కరీనా కపూర్ ను సీత పాత్ర కోసం సంప్రదించామనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేల్చారు.
ఏదైనా వార్త ఉంటే తమ అధికారిక ఖాతాల నుండి వెల్లడిస్తామని చిత్ర బృందం చెప్పుకొచ్చింది.
కరీనా కపూర్ ఖాన్ ను సీత పాత్ర పోషించడానికి తీసుకున్నారని.. ఆమెకు 12 కోట్లు ఇస్తున్నారంటూ వైరల్ అవుతున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.