Fact Check : భార్య, కుమార్తె కళ్ల ముందే ప్రాణాలు వదిలిన వ్యక్తి.. బెంగాల్ హింసతో ఎటువంటి సంబంధం లేదు..!

Wailing Teenager in Viral Video is From AP Not West Bengal. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకున్న

By Medi Samrat  Published on  8 May 2021 10:21 AM GMT
Fact Check : భార్య, కుమార్తె కళ్ల ముందే ప్రాణాలు వదిలిన వ్యక్తి.. బెంగాల్ హింసతో ఎటువంటి సంబంధం లేదు..!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ఎంతో మంది సోషల్ మీడియా యూజర్లు కూడా ఓ యువతి తండ్రి శవం వద్ద ఏడుస్తూ ఉన్న వీడియోను పోస్టు చేశారు. ఆ అమ్మాయి తండ్రికి నీళ్లు తప్పడానికి వెళుతూ ఉండగా.. మరో మహిళ ఆపుతూ ఉండడాన్ని వీడియోలో గమనించవచ్చు.

'బెంగాల్ లో పరిస్థితి చాలా ఘోరంగా ఉంది.. రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ ఉన్నాము.. బెంగాల్ ఆర్మీ చేతుల్లోకి వెళ్ళాలి' అంటూ పలువురు ఈ వీడియోను షేర్ చేస్తూ ఉన్నారు.

ఈ వీడియోకు ఎన్నో రీట్వీట్లు కూడా లభించాయి.

నిజ నిర్ధారణ:

ఈ వీడియోకు బెంగాల్ లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వీడియోను రికార్డు చేస్తున్న వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ ఉండడాన్ని గమనించవచ్చు. ఈ వీడియో లోని ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

స్థానిక మీడియాతో పాటూ.. నేషనల్ లెవల్ మీడియాలో కూడా ఈ ఘటన గురించి కథనాలు వచ్చాయి. కరోనాతో బాధపడుతున్న తన తండ్రికి నీళ్లు ఇవ్వడానికి ఆ అమ్మాయి ప్రయత్నించగా.. ఆమె తల్లి దగ్గరకు వెళ్ళద్దు అంటూ హెచ్చరిస్తూ ఉన్న వీడియో ఇది. మే 5న ఎన్డీటీవీలో ఆర్టికల్ కూడా వచ్చింది.

https://www.youtube.com/watch?v=hoCs59Kyp0&list=PL3ZQ5CpNulQmOaZcxsbafw42qA_IQm6uW

ఈ ఘటనపై The News Minute, Tribune, India Today, Times Now వంటి మీడియా సంస్థలు కథనాలు రాసుకొచ్చాయి.

ఇండియా టుడే కథనం ప్రకారం.. చనిపోయిన వ్యక్తిని 50 ఏళ్ల అసిరినాయుడుగా గుర్తించారు. క‌రోనా సోకి శ్వాస ఆడ‌క, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఓ తండ్రికి బిడ్డ సాహ‌సం చేసి నీళ్లు ఇచ్చేందుకు వెళ్తుండ‌గా, వ‌ద్ద‌మ్మా అంటూ త‌ల్లి ఆపింది. అయినా తండ్రి మీదున్న ప్రేమ‌తో ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లిన కుమార్తె నీళ్లు గొంతులో పోసింది. అసిరినాయుడు ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అసిరినాయుడు విజ‌య‌వాడ‌లో ప‌ని చేస్తూ జీవ‌నం కొన‌సాగిస్తున్నాడు. ఆయ‌న కుటుంబం సొంత జిల్లాలోనే నివాసం ఉంటుంది. ఇటీవ‌లే క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో సొంతూరికి చేరుకున్నాడు. దీంతో అతన్ని గ్రామంలోకి రానివ్వ‌లేదు. ఊరి బ‌య‌ట ఉన్న ఓ గుడిసెలో ఉండాల‌ని గ్రామ‌స్తులు ఆదేశించారు. అత‌ను అక్క‌డే త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉంటున్నాడు. ఆయ‌న భార్య‌, కుమార్తె, కుమారుడికి కూడా క‌రోనా సోకింది. ఆ వ్య‌క్తి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింది. చివ‌ర‌కు శ్వాస ఆడ‌క కొన ప్రాణాల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. తండ్రిని ఎలాగైనా బ‌తికించుకోవాల‌నే ఉద్దేశంతో ఆయ‌న నోట్లో నీళ్లు పోసింది. ఆ త‌ర్వాత క్ష‌ణాల్లోనే ఆయ‌న ప్రాణాలు విడిచాడు. బిడ్డ తండ్రికి నీళ్లు తాగించేందుకు వెళ్తుండ‌గా భ‌యంతో త‌ల్లి వ‌ద్ద‌ని వారించింది. అయిన‌ప్ప‌టికీ ఆ బిడ్డ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు.

ఈ వీడియోకు బెంగాల్ రాష్ట్రంలో హింసకు ఎటువంటి సంబంధం లేదని తెలుస్తోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో చోటు చేసుకుంది.


Next Story