డ్రైవర్‌లెస్ కార్ సర్వీస్ చెన్నైలో ప్రారంభమైందంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. డ్రైవర్‌లేని కారులో ఓ వృద్ధురాలు తమిళంలో మాట్లాడుతూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫేస్‌బుక్ వినియోగదారులు “డ్రైవర్‌లెస్ టాక్సీ సేవ ప్రపంచంలోనే మొదటిసారి చెన్నైలో ప్రారంభమైంది. ప్రయాణమును ఆస్వాదించండి” అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
పలువురు సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేశారు.
యూట్యూబ్ లో కూడా ఇదే వాదనతో వీడియోను షేర్ చేయడం మీరు చూడొచ్చు.
నిజ నిర్ధారణ :
ఈ వీడియో అమెరికాకు సంబంధించినదని NewsMeter కనుగొంది.
మేము వీడియోలో పలు విషయాలను గమనించాము. భారతదేశంలో, స్టీరింగ్ వీల్ కుడి వైపున ఉంటుంది.. అయితే, వైరల్ వీడియోలో, కారు ఎడమ వైపున స్టీరింగ్ వీల్ ఉంది. భారతదేశంలో ట్రాఫిక్ ఎడమ వైపున ఉన్న సమయంలో మహిళ రోడ్డుకు కుడి వైపు నుండి కారులోకి వచ్చారు. కారుపై కంపెనీ పేరు ‘వేమో’ అని కూడా రాసి ఉన్నట్లు కూడా గుర్తించాం.
తర్వాత.. మేము Waymo గురించి సెర్చ్ చేశాం. ఇది Google సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ప్రాజెక్ట్ అని కనుగొన్నాము. కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం ఉంది. అమెరికన్ అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న కారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని.. మేము సంబంధిత కీవర్డ్ సెర్చ్ ను అమలు చేసాము. సెప్టెంబర్ 8న అప్లోడ్ చేసిన YouTube వీడియోను మేము కనుగొన్నాము. వీడియోలో ఉన్నది అమెరికాలో డ్రైవర్ లెస్ టాక్సీ అని వీడియో టైటిల్ ద్వారా కనుగొన్నాం.
మేము భారతదేశంలో Waymo డ్రైవర్‌లెస్ టాక్సీ సర్వీసు గురించి సెర్చ్ చేశాం. కానీ విశ్వసనీయ మీడియా నివేదికలు ఏవీ కనుగొనలేకపోయాం. అయితే, మేము Mashable కు సంబంధించి 2017 నాటి నివేదికను చూశాము. సెల్ఫ్-డ్రైవింగ్ కార్ కంపెనీ వేమో అరిజోనాలోని ఫీనిక్స్‌లో పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిందని.. డ్రైవర్‌లెస్ మినీవ్యాన్‌లలో ప్రజలు ఉచితంగా రైడ్‌లకు వెళ్లే అవకాశం కల్పిస్తుందని వివరించారు. టెక్ క్రంచ్ కు సంబంధించిన మరో 2017 నివేదిక ప్రకారం, US రాష్ట్రంలోని అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో కూడా Waymo తన డ్రైవర్‌లెస్ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తోంది.
కాబట్టి, ఆ వీడియో భారతదేశానికి చెందినది కాదని మేము నిర్ధారించాము. చెన్నైలో డ్రైవర్ లెస్ ట్యాక్సీ సేవలు ప్రారంభమవుతున్నాయన్న వాదన అవాస్తవం.
Credits : Md Mahfooz Alam