మాస్కులు లేకుండా రోడ్డు మీదకు వస్తున్న వారికి చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు ఫైన్లు వేస్తూ ఉన్నాయి. తాజాగా మాస్కు లేకుండా రోడ్డు మీదకు వచ్చిన వారిని పోలీసులు పట్టుకుని పోలీసుల వాహనాల్లో తరలిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారని.. వారిని 10 గంటల పాటూ జైలులో ఉంచుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది.
వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడమే కాకుండా "Without mask 10 hours jail in Delhi and soon to be followed on Mumbai, Bangalore, Hyderabad and other States." అంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు. మాస్క్ లేకుండా ఉన్న వారిని 10 గంటల పాటూ జైలులో ఉంచుతున్నారని.. ఢిల్లీలో వచ్చిన ఈ రూల్ ముంబై, బెంగళూరు, హైదరాబాద్.. ఇతర రాష్ట్రాల్లోనూ త్వరలోనే అమలు చేస్తారని చెబుతూ వస్తున్నారు.
నిజ నిర్ధారణ:
మాస్కు లేకుండా తిరుగుతున్న వాళ్ళను పోలీసులు పట్టుకుంటున్న ఈ ఘటన ఢిల్లీలో జరిగిందంటూ వైరల్ అవుతున్న ప్రచారంలో 'ఎటువంటి నిజం లేదు'.
న్యూస్ మీటర్ వీడియోను నిశితంగా పరిశీలించగా.. పోలీసులు తరలిస్తున్న వాహనం నంబర్ ప్లేట్ మీద 'MP' అని ఉంది. నంబర్ ప్లేట్ మీద MP అని ఉంటే అది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాహనం అని స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకోలేదని అర్థం అవుతోంది. ఆ వాహనంకు సంబంధించిన వివరాలు MP Transport Department's e-portal లో లభించాయి. ఆ వాహనం మధ్యప్రదేశ్ కు చెందినదని వివరాలు ఉన్నాయి.
ఈ ఘటనకు సంబంధించి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా News 18, Zee News లో కథనాలు కూడా వచ్చాయి. అదే వీడియోను చూపించారు కూడానూ. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కలిసి జాయింట్ టీమ్ గా ఈ ఆపరేషన్ చేపట్టారు. మాస్క్ లేకుండా ఉన్న వారిని పోలీసులు అదుపు లోకి తీసుకుని 10 గంటల పాటూ ఓపెన్ జైలులో ఉంచారు. ఉజ్జయిని నగరంలో ఈ ఘటన చోటు చేసుకుందని India Today, Indore News, Hindustan Live మీడియా సంస్థలు స్పష్టం చేశాయి.
మాస్కు లేకుండా తిరుగుతున్న వాళ్ళను పోలీసులు పట్టుకుంటున్న ఈ ఘటన ఢిల్లీలో జరిగిందంటూ వైరల్ అవుతున్న ప్రచారంలో 'ఎటువంటి నిజం లేదు'. ఈ ఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని ఉజ్జయిని నగరంలో చోటుచేసుకుంది.