నిజమెంత: పేదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారా?
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 9 July 2024 6:45 AM GMTనిజమెంత: పేదలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారా?
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. 'రాబోయే ఐదేళ్లు పేదలపై నిర్ణయాత్మక యుద్ధం' అని ఆ క్లిప్‌లో ప్రధాని చెప్పినట్లు మనం వినొచ్చు.
అయితే కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా ఈ వీడియోను షేర్ చేస్తూ, “ప్రధాని గారూ, పేదలపై పోరాటం చేయడానికి మేము మిమ్మల్ని అనుమతించము” అని చెప్పుకొచ్చారు.
మరో కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే ఈ వీడియోను షేర్ చేస్తూ, “రాబోయే ఐదేళ్లు పేదరికంపై నిర్ణయాత్మక యుద్ధం: నరేంద్ర మోదీ. లేదు, మీ ఉద్దేశం నెరవేరదు. పేదలతో పోరాడకుండా భారతదేశం నిన్ను అడ్డుకుంటుంది." అని తెలిపారు.
“దేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ నినాదాన్ని అందించారు. నరేంద్ర మోదీ ‘పేదలను తొలగించండి’ అనే నినాదాన్ని ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో పేదలపై మా ప్రభుత్వం నిర్ణయాత్మక పోరాటం చేస్తుంది. - నరేంద్ర మోదీ." అని కాంగ్రెస్ నాయకురాలు రీతూ చౌదరి కూడా ఈ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
న్యూస్‌మీటర్ ఈ క్లెయిమ్ ప్రజలను తప్పుదారి పట్టించేదిగా గుర్తించింది. అసలైన వీడియోలో ప్రధాని మోదీ తనను తాను సరిదిద్దుకున్నారు.. రాబోయే ఐదు సంవత్సరాలు పేదరికంపై పోరాటం చేస్తామని నొక్కిచెప్పారు.
మేము వైరల్ క్లిప్‌లో జూలై 3 తేదీని, టైమ్ స్టాంప్ 12:24ని గమనించాము. దీంతో మేము PM మోదీ యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో కోసం శోధించాము. ‘రాజ్యసభలో ధన్యవాద తీర్మానానికి ప్రత్యుత్తరం సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగం’ అనే శీర్షికతో జూలై 3న ప్రచురించబడిన వీడియోను మేము కనుగొన్నాము.
ఒరిజినల్ వీడియోలో వైరల్ క్లిప్ వీడియోలోని 18:51 మార్క్ దగ్గర కనిపించింది. రాజ్‌సభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖర్‌ను ఉద్దేశించి ప్రధాని మోదీ.. "రాబోయే ఐదేళ్లు పేదలపై నిర్ణయాత్మక యుద్ధం" అని అన్నారు. అయితే మోదీ తనను తాను సరిదిద్దుకుని, “రాబోయే ఐదేళ్లు పేదరికానికి వ్యతిరేకంగా పేదల పోరాటం చేద్దాం. పేదలు సమిష్టిగా నిలబడినప్పుడు పేదరికంపై పోరాటం విజయవంతమవుతుందని నేను నమ్ముతున్నాను. అందుకే, రాబోయే ఐదేళ్లలో పేదరికంపై పోరాటం చేద్దాం. ఈ పోరాటంలో దేశం గెలుస్తుందని గత పదేళ్ల అనుభవంతో నేను నమ్మకంగా చెప్పగలను." అని అన్నారు.
భారతదేశం ప్రపంచంలోని మూడవ-అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వల్ల చోటు చేసుకునే పరిణామాలను కూడా ఆయన వివరించారు. దేశీయంగా ప్రజల జీవితంలోని ప్రతి కోణంపై ప్రభావం ఉంటుందని.. ప్రపంచ వేదికపై భారతదేశ అపూర్వమైన ప్రభావాన్ని కూడా హైలైట్ చేశారు.
మేము జూలై 3న PMIndia.gov వెబ్‌సైట్‌లో 'రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి PM's ప్రత్యుత్తరం' అనే శీర్షికతో ప్రచురించిన ట్రాన్స్ క్రిప్ట్ ఆఫ్ స్పీచ్ ను కూడా మేము కనుగొన్నాము. తొమ్మిదవ పేరాలో, ప్రధాని మోదీ “పేదరికంపై పోరాటానికి రాబోయే 5 సంవత్సరాలు చాలా కీలకమని హైలైట్ చేశారు. గత 10 సంవత్సరాల అనుభవాల ఆధారంగా పేదరికానికి వ్యతిరేకంగా నిలబడటానికి, దానిని అధిగమించడానికి పేదల సామర్థ్యాలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు" అని అందులో ఉంది.
అందువల్ల, వైరల్ వీడియో ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎడిట్ చేశారని మేము నిర్ధారించాము. పేదరికం లేకుండా చేయడానికి తాను లేదా తన ప్రభుత్వం నిర్ణయాత్మక పోరాటం చేస్తుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.