FactCheck : ట్యాంక్ బండ్ లో నుండి నీరు పొంగి పొర్లుతూ ఉన్నాయా..?

Viral Video of Overflowing Tank Bund is From 2020. సైక్లోన్ గులాబ్ కారణంగా హైదరాబాద్ ను వరదలు ముంచెత్తుతున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Sep 2021 9:32 AM GMT
FactCheck : ట్యాంక్ బండ్ లో నుండి నీరు పొంగి పొర్లుతూ ఉన్నాయా..?

సైక్లోన్ గులాబ్ కారణంగా హైదరాబాద్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో తెలంగాణ పోలీసు శాఖ అప్ర‌మ‌త్త‌మైంది. అత్య‌వ‌స‌రం అయితే త‌ప్ప బ‌య‌ట‌కు రావొద్దని సూచించింది. లోత‌ట్టు ప్రాంతాల వారు అప్ర‌మ‌త్తంగా ఉండాలంటూ పేర్కొంది. వ‌ర‌ద ఉద్దృతి ఉన్న‌ప్రాంతాల్లో నీటి గుండా దాటే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని కోరింది. ఏదైన స‌మ‌స్య వ‌స్తే.. వెంట‌నే డ‌య‌ల్ 100కి ఫోన్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు వర్షాల కారణంగా జలమయమయ్యాయి.

ఇలాంటి సమయంలో హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నుండి నీరు పొంగిపొర్లుతున్నాయంటూ పలువురు ట్వీట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ట్యాంక్ బండ్ లో నుండి నీరు పొంగి పొర్లుతూ ఉన్నాయని.. చుట్టుపక్కల ప్రాంతాలు కూడా జలమయమవుతున్నాయని వాట్సాప్ లో వీడియోను షేర్ చేస్తున్నారు.


`ToliveluguTV' ఛానల్ యూట్యూబ్ లో సెప్టెంబర్ 27 న వీడియోను పోస్టు చేసింది. `The Hyderabad Express' అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా అదే వీడియోను పోస్టు చేశారు. "Hussain Sagar Tank Bund and Nalas of Hyerdabad overflow due to heavy rain on 27 Sept 2021." అంటూ వీడియోను పోస్టు చేశారు.

నిజ నిర్ధారణ:

ఇది ఇప్పటి వీడియో కాదు.. ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించిన వీడియో కాదు.

`Tank bund rains' అనే కీవర్డ్ ను ఉపయోగించి న్యూస్ మీటర్ సెర్చ్ చేయగా.. పలు వీడియోలు కనిపించాయి. `Sach Aap Tak' అనే యూట్యూబ్ ఛానల్ లో అక్టోబర్ 2020న ఇదే వీడియోను పోస్టు చేయడం గమనించవచ్చు. అదే వైరల్ వీడియోనే ప్రస్తుతం మరోసారి వైరల్ చేస్తున్నారు. ప్లే చేసి చూడగా వాయిస్ ఓవర్ కూడా ఒకేలా ఉంది. ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఆల్పైన్ టవర్స్ నుండి ఈ వీడియోను తీశారు.


ఇదే వీడియోను పలు తెలుగు మీడియా ఛానల్స్ కూడా యూట్యూబ్ లో అక్టోబర్ 2020న అప్లోడ్ చేశాయి. `Full Water Level In Hussain Sagar At Tank Bund' అంటూ యూట్యూబ్ లో NTV తెలుగు పోస్టు చేసింది.


The New Indian Express కూడా అక్టోబర్ 2020లో హైదరాబాద్ లో భారీ వర్షాలు పడ్డాయని కథనాలను ప్రసారం చేసింది. హుస్సేన్ సాగర్ నిండుకుండలా మారిపోయిందని తెలిపింది. ఫుల్ ట్యాంక్ లెవల్ కెపాసిటీ 513.700 కు చేరుకుందని అప్పట్లో వెల్లడించింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. దీంతో హుస్సేన్ సాగర్ లోని నీటిని విడుదల చేశారు.

The Hans India అక్టోబర్ 21న ఇదే విషయాన్ని వెల్లడించింది.

న్యూస్ మీటర్ ట్విట్టర్ ఖాతాలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విషయాన్ని చూడొచ్చు.

కాబట్టి ట్యాంక్ బండ్ నుండి నీరు విడుదల చేస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియోలు ఇప్పటివి కావు.


Claim Review:ట్యాంక్ బండ్ లో నుండి నీరు పొంగి పొర్లుతూ ఉన్నాయా..?
Claimed By:Social Media Users
Claim Reviewed By:Newsmeter Telugu
Claim Source:Youtube Channel
Claim Fact Check:False
Next Story