హనుమాన్ విగ్రహంపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని శామీర్‌పేటలో చోటు చేసుకున్న వీడియో అంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. వాట్సాప్‌లో ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయాలని, వీడియోలోని వ్యక్తిని కనిపెట్టడానికి వాట్సాప్ స్టేటస్ గా కూడా ఉంచాలని ఇతరులను కోరుతున్నారు.
మేము YouTube Shorts (వీక్షకుల విచక్షణతో సూచించబడింది) లో కూడా అదే వీడియోను కూడా కనుగొన్నాము. ఇక్కడ కామెంట్స్ విభాగంలో ఒక వినియోగదారు ఈ వీడియో హైదరాబాద్‌లోని షామీర్‌పేట్‌కి చెందినదని అన్నారు.
నిజ నిర్ధారణ :
వైరల్ వీడియో హైదరాబాద్‌కు చెందినది కాదని.. ఇటీవలి సంఘటన అసలు కాదని న్యూస్‌మీటర్ కనుగొంది.
మేము సెర్చ్ చేయగా.. హనుమాన్ విగ్రహంపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన వీడియో హైదరాబాద్‌లోని శామీర్‌పేట ప్రాంతానికి చెందినది కాదని స్పష్టం చేస్తూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో ఒక ట్వీట్ కనుగొన్నాము.
"హనుమంతుని విగ్రహంపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేస్తున్న దృశ్యాలను చూపిస్తూ, ఈ సంఘటన ఇటీవల హైదరాబాద్‌లోని శామీర్‌పేట ప్రాంతంలో జరిగింది అన్న తప్పుడు సమాచారంతో ఒక వీడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. నిజానికి ఈ ఘటన అక్టోబర్ 2018లో ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలోని బర్నహల్ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో నిందితుడైన అర్జున్ సింగ్ జాతవ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ఉద్దేశపూర్వకంగా మత విశ్వాసాలను కించపరిచేలా ప్రవర్తించాడని వివిధ సెక్షన్లకింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే, ఈ సంఘటన హైదరాబాద్‌లోని శామీర్‌పేట ప్రాంతంలో జరిగింది అన్నది అవాస్తవం." అంటూ తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ వింగ్ స్పష్టం చేసింది.
దీన్ని క్యూగా తీసుకొని, మేము కీవర్డ్ సెర్చ్ చేసాము. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరాన్‌హాల్‌లో చోటు చేసుకుందంటూ.. ఒక వైరల్ ట్వీట్ ను కనుగొన్నాం. అర్జున్ సింగ్ జాతవ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినందుకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఇంటర్నెట్ యూజర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్దేశ్యపూర్వకంగా మత విశ్వాసాలను దెబ్బతీసినందుకు అర్జున్‌పై కేసు నమోదు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీర్పు కాపీని చూడవచ్చు.
న్యూస్‌మీటర్ షామీర్‌పేట ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డిని సంప్రదించింది. ఆయన కూడా ఈ వాదనను ఖండించాడు. ‘‘ఈ ఘటన 2018లో ఉత్తరప్రదేశ్‌లో జరిగింది, హైదరాబాద్‌లోని శామీర్‌పేట కు సంబంధించినది కాదు. తప్పుడు వార్తలను ఫార్వార్డ్ చేసిన వారిపై కేసు నమోదు చేశాం'' అని తెలిపారు.
నిజమెంత: హనుమంతుడి విగ్రహంపై మూత్ర విసర్జన చేస్తున్న ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది కాదుకాబట్టి.. వైరల్ వీడియో ఇటీవలిది కాదని, హైదరాబాద్‌కు సంబంధం లేదని స్పష్టమవుతోంది.
Credits : Sunanda Naik